బీజేపీ సీట్లలో టీఆర్ఎస్ ఎందుకు అభ్యర్థులు ప్రకటించలేదు

By narsimha lodeFirst Published Sep 6, 2018, 7:12 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే  తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే  తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్.. బీజేపీ మధ్య మైత్రి ఉంటుందనే ప్రచారాన్ని కేసీఆర్ కొట్టిపారేశారు.అయితే ఈ స్థానాల్లో స్థానికంగా పార్టీ నేతలతో చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, గోషామహాల్, ఉప్పల్ స్థానాల్లో 2014 ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థులు  విజయం సాధించారు. అయితే ఉప్పల్ స్థానంలో మాత్రమే  టీఆర్ఎస్ అభ్యర్థిగా బేతి సుభాష్ రెడ్డి పేరును ప్రకటించారు.  అంబర్‌పేట , ఖైరతాబాద్, గోషామహాల్, ముషీరాబాద్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.

అయితే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా... ఈ కారణంగానే  ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదా అని మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు కేసీఆర్ కొంత ఆగ్రహాం వ్యక్తం చేశారు.

రెండు పార్టీల మధ్య మిత్రత్వం లేదన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీతో తమకు ఎలాంటి పొత్తులు లేవన్నారు.  మజ్లిస్ తమకు మితృత్వం కొనసాగుతోందని కేసీఆర్ ప్రకటించారు.

ముషీరాబాద్ లో గతంలో నాయిని నర్సింహ్మరెడ్డి ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లో నాయిని నర్సింహ్మరెడ్డి పోటీ చేయలేదు. ముషీరాబాద్ నుండి నాయిని నర్సింహ్మారెడ్డి సూచించిన వ్యక్తికి సీఎం టిక్కెట్టును కేటాయించే అవకాశం లేకపోలేదు.

ఖైరతాబాద్ లో కార్పోరేటర్ విజయారెడ్డి టిక్కెట్టును ఆశిస్తున్నారు.  అయితే  ఇప్పటికే  ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి ఈ స్థానంలో విజయం సాధించారు. 

దానం నాగేందర్ ఇటీవలనే టీఆర్ఎస్ లో చేరారు. దానం నాగేందర్ కు టిక్కెట్టు ఇస్తే విజయారెడ్డి పరిస్థితి ఏమిటనే చర్చ కూడ లేకపోలేదు.విజయారెడ్డి కూడ ఖైరతాబాద్ టిక్కెట్టును ఆశిస్తున్నారు.  అంబర్ పేటలో ఇంకా ఎవరికి టిక్కెట్లను కేటాయిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

తాము కూడ ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదో కేసీఆర్ చెప్పాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

click me!