గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై తీవ్ర చర్చ మొదలైంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఈ ప్రశ్న వేసిన తర్వాత ఈ చర్చ మరింత తీవ్రతరమైంది. తాజాగా, ఎంఐఎం పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఎంఐఎం పార్టీపై అనుమానాలను మరింత పెంచాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాజాసింగ్ పై అభ్యర్థిని ప్రకటించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: బీజేపీ, ఎంఐఎం పార్టీకి చీకటి ఒప్పందం ఉన్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గెలిచిన గోషామహల్ స్థానంలో ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని ప్రకటించడం లేదని ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ముస్లింల హక్కుల కోసం పోరాడాలని అసదుద్దీన్‌ను తండ్రి బారిస్టర్ చదివిస్తే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముస్లింలను ఇబ్బంది పెట్టే బీజేపీకి మద్దతుగా ఉన్నారని రేవంత్ ఆరోపించారు. అసదుద్దీన్ ధరించే షేర్వాని కింద పైజామా ఉన్నదనుకున్నా కానీ, ఖాకీ నిక్కర్ ఉన్నదా? అని కామెంట్ చేశారు. ఈ ఆరోపణలు సంచలనం కావడంతో అసదుద్దీన్ సోదరుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఆరోపణల్లో నిజమెంతా అనే చర్చ మొదలైన తరుణంలో మరో ఓ ఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటే అసదుద్దీన్ ఒవైసీ తనకు టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. గోషామహల్‌లో 80 వేల ముస్లిం ఓట్లు ఉన్నాయని ఎంఐఎం సీనియర్ లీడర్ ఖాజా బిలాల్ అన్నారు. కానీ, అక్కడి నుంచి ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పై ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించలేదని సంచలన ఆరోపణలు చేశారు. అసలు గోషామహల్ స్థానంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఓ కుట్ర ఉన్నదని తీవ్రంగా ఆరోపించారు.