టీఆర్ఎస్ తెలివైన అడుగు: హుజూర్ నగర్ లో సిపిఐ బలం ఇదీ...

By narsimha lodeFirst Published Oct 2, 2019, 3:53 PM IST
Highlights

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు కోరడం వెనుక కేసీఆర్ వ్యూహత్మక అడుగులు వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హుజూ‌ర్‌నగర్: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, సీపీఐలు జతకట్టాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన సీపీఐ ఇప్పుడు స్నేహహస్తం అందించింది.

 టీఆర్‌ఎస్‌ నేతలు కేశవరావు, ఇతర నేతలు ఉపఎన్నికలో మద్దతివ్వాలని కోరగా రాష్ట్ర పార్టీలో చర్చించి చాడ వెంకటరెడ్డి మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ కంగుతింది. ఇదిలా ఉండగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ మాత్రం ఉత్తమ్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. బుధవారం కోదండరామ్‌ బుధవారం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉపఎన్నిక నోటిఫికేషన్‌ రోజే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీపీఐ నేతలను కోరారు. ఆతర్వాత ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చాడా వెంకటరెడ్డిని రెండువిడతలుగా కలిశారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. అధికార పార్టీతో సీపీఐ జత కట్టింది. 

దీంతో కాంగ్రెస్‌, సీపీఐల బంధం తెగిపోయింది. రాష్ట్రంలో ఇన్నాళ్లు మహాకూటమిగా ఉన్న కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, జనసమితిలు చెల్లాచెదురుగా విడిపోయాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీ చేసిన నేతలు ఉప ఎన్నిక వచ్చే సరికి తలోదారిలో వెళ్లిపోయారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కోరినా సీపీఐ నేతలు టీఆర్‌ఎస్‌కే మొగ్గుచూపారు. రాష్ట్రంలో రెండు పార్టీల పొత్తులు మునిసిపల్‌ ఎన్నికల్లో కొనసాగే అంశాలు కనిపిస్తున్నాయి.
 
ఇదిలా ఉండగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో సీపీఐకి బమైనన ఓటు బ్యాంక్‌ ఉంది. హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని పాత తాలూకా పరిధిలోని తెలంగాణ సాయుధపోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ సాయుధ పోరాటానికి చెందిన నేతలు సీపీఐ సానుభూతి పరులుగా ఉన్నారు. కాగా నియోజకవర్గంలోని చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో సీపీకి బలమైన నాయకత్వం ఉంది.

 ఉప ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తి సీపీఐకి ఉంది. ఆపార్టీకి 8వేలనుంచి 10వేల ఓట్లు ఉన్నాయి. ఇవి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తే గెలుపు మరింత సునాయసం అవుతుందని భావించారు. దీంతోనే సీపీఐ రాష్ట్ర నేతలను టీఆర్‌ఎస్‌ కలసి వివరించినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని గమనించిన మంత్రి జగదీష్ రెడ్డి సీపీఐతో పొత్తు విషయమై సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్ సీపీఐ నేతల వద్దకు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావుతో పాటు ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లు గత నెల 29వ తేదీన భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: కాంగ్రెస్‌కు టీజేఎస్ మద్దతు

click me!