
ఉస్మానియా నూరు సంవత్సరాల పండుగ సంబురాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడలేదు. గవర్నరూ మాట్లాడలేదు, అది వేరేవిషయం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణా ఉద్యమానికి గుండేకాయ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమేమిటి? ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.
ఈ రోజు జరిగిన సెంటినర సెలెబ్రేషన్స్ లో కేవలం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే మాట్లాడారు. ఆతర్వాత జనగణమన పాడారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదు?
యూనివర్శిటి అధ్యాపకుల మధ్య ఉన్నవాదన ఏమిటంటే, కెసిఆర్ లేవగానే నినాదాలిచ్చేందుకు చాలా మంది విద్యార్థులు సిద్ధమయ్యారట. నిజానికి చాలా జాగ్రత్తగా ఈకార్యక్రమానికి పాస్ ల్ ఇచ్చినా, కొంతమంది విద్యార్థిసంఘాలనాయకులు కూడా సభలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయట. అందువల్ల రాష్ట్ర పతి ఎదురుగా ఉన్నపుడు సభలో ముఖ్యమంత్రి వ్యతిరేక నినాదాలు చేస్తే రాష్ట్ర పరువు పోతుంది కాబట్టి, ముఖ్యమంత్రి మాట్లాడకుండా మానేశారని, రాష్ట్రపతి ప్రసంగంతోనే సరిపుచ్చారని కొంతమంది అధ్యాపకులు భావిస్తున్నారు.
తెలంగాణా ఉద్యమం రోడ్ల మీద ఒకడుకు వెనకేసినపుడల్లా దాన్ని జాగ్రత్తగా కాపాడింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. రాజకీయ పార్టీలు,రాజకీయాలతో ఉద్యమాన్ని పక్కన పెట్టినపుడు, తెలంగాణా అవసరంలేదని ఫీలయినపుడు, ఉద్యమదీపం కొడిగట్టకుండా చూసిందే ఈ చెట్లకింద కూర్చుని తెలంగాణా గురించి కలలు కన్న విద్యార్థులే. అలాంటి విశ్వవిద్యాలయం తెలంగాణా వచ్చాక కూడా ఉద్యమం అంటూ మాట్లాడటం ఏలిక వారికినచ్చడంలేదు. అందుకే తెలంగాణా రాష్ట్రం వచ్చాక ఉస్మానియా మీద వివక్షమొదలయింది అని ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారుకూడా అంటున్నారు. ఈ వివక్షలో భాగంగానేముఖ్యమంత్రి ఉస్మానియాలో ఒక్కసారి కూడా కాలుమోపలేదు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వానికి,ఉస్మానియాకు బాగా అంతరం పెరిగింది. చివరకు శత్రుశిబిరాల్లా తయారయ్యారు.
నీళ్లు, నిధుల, ఉద్యోగాల తెలంగాణా వస్తే, నీళ్లు రైతులకు, నిధులు ప్రజలకు ఉద్యోగాలు యవకులకు అని కలలు కన్నా,ఉద్యోగాల్లేకపోవడంతో ఉస్మానియా మళ్లీ ఉద్యమ కేంద్రం అయ్యేందుకుసిద్ధంగా ఉంది. అసలు ముఖ్యమంత్రిని క్యాంపస్ కాలుమోపనీయమన్నారు. గత పదిరోజులుగా విద్యార్థులకు, యూనివర్శిటీ అధికారులకు,పోలీసు ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్ర పతి రాక సందర్భంగా క్యాంపస్ లో ఎలాంటి అలజడి లేకుండా చూడాలని అధికారులు కోరారు. చర్చలు సఫలం కాలేదు. ఫలితంగా చాలా మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం కూడా కొందరిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అని అనే లోపే కొంతమంది విద్యార్థులను పోలీసుల అదపులోకి తీసుకున్నారు (కిందిఫోటో). రాష్ట్రపతి ప్రసంగించేసభలోకి విద్యార్థినాయకులెవరూ రాకుండా ఉండేందుకు పాస్ లను పరిమితం చేశారు. ఆన్ లైన్ లో అప్లయి చేసుకోమన్నారు. ఎలాంటి ఉద్యమ చరిత్ర లేని విద్యార్థులకే పాస్ లు ఇచ్చారు. అయితే, ‘అల్లరిమూకలు’ పాస్ లు సంపాయించారని పోలీసులకు సమాచారం అందిందట. దీనితో ముఖ్యమంత్రి ప్రసంగం లేకుండా చేశారు.
దేశంలోని ఒక విశిష్టమయిన విశ్వవిద్యాలయం నూరేళ్ల పండగ చేసుకుంటున్నపుడు ముఖ్యమంత్రి ప్రసంగించకపోవడం జరగదు. ఇపుడు ఉస్మానియాలోజరిగింది. క్యాంపస్ లో ఇపుడు జోరుగా చర్చిస్తున్న విషయమిదే.