New IT Minister : కొత్త ఐటీ మంత్రి ఆయనేనా? కేటీఆర్ ను మరిపించేనా..!  

By Arun Kumar P  |  First Published Dec 5, 2023, 4:23 PM IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠ ఐటీ మంత్రి పదవిపైనా నెలకొంది. కేటీఆర్ స్థానంలో ఐటీ మంత్రి ఎవరు అవుతారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన టిపిసిసి పక్కా ప్రణాళికతో ఎన్నికలకు వెళ్లి మెజారిటీ సీట్లు సాధించింది... దీంతో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కలలు నెరవేరలేదు. ఓటమిని అంగీకరించిన కేసీఆర్ ఇప్పటికే రాజీనామా చేయడంతో మంత్రివర్గం రద్దయ్యింది. అయితే  ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా వున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో సీఎం, మంత్రులు వీరేనంటూ కొందరు కాంగ్రెస్ నేతల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 

అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠ ఐటీ మంత్రి పదవిపైనా నెలకొంది. బిఆర్ఎస్ హయాంలో ఐటీ అంటే కేటీఆర్... కేటీఆర్ అంటే ఐటీ అనేలా వుండేది... కాబట్టి కాంగ్రెస్ సర్కార్ ఐటీ పదవి ఎవరికి ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే నూతన ఐటీ మంత్రి వీరేనంటూ కొన్ని పేర్లు ప్రచారం అవున్నాయి. అందులో ముఖ్యంగా వినిపిస్తున్నది దుద్దిళ్ల శ్రీధర్ బాబుది. 

Latest Videos

మంథని ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతుడు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం శ్రీధర్ బాబు సొంతం. దీంతో ఆయనయితే ఐటీ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించగలడని... కేటీఆర్ పేరును మరిపించగలడని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందట. అందువల్లే ఆయనకు ఐటీ మంత్రి పదవి దాదాపు ఖరారయ్యిందంటూ కాంగ్రెస్ శ్రేణులు చెప్పడమే కాదు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

Also Read  New Cabinet : కొత్త మంత్రులు వీరేనా..? మరీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు?

ఇక శ్రీధర్ బాబు కాకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎవరో ఒకరిని ఈ ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం వుందట. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడికే ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అదిష్టానం చూస్తోందట. అందువల్లే సీఎం రేసులో వున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఐటీ శాఖతో పాటు మరికొన్ని కీలక శాఖలు అప్పగించే అవకాశం వున్నట్లు చర్చ జరుగుతోంది. కాదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించవచ్చని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి పదవిపై సందిగ్దత నెలకొన్నా రేవంత్ రెడ్డికే ఆ పదవి దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐటీ శాఖ కూడా తనవద్దే రేవంత్ పెట్టుకోనున్నాడనే మరో వాదన వినిపిస్తోంది. తెలంగాణ మరీముఖ్యంగా ఐటీ అభివృద్దిని కొనసాగించేందుకు ఈ శాఖ ముఖ్యమంత్రి వద్దే వుంటే బావుంటుందని కాంగ్రెస్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

ఇలా ముఖ్యమంత్రి పదవి స్థాయిలోనే ఐటీ శాఖపై చర్చ జరుగుతోంది. కొందరు బిఆర్ఎస్ అభిమానులు, నెటిజన్లయితే అధికారం కాంగ్రెస్ దే అయినా ఐటీమంత్రిగా కేటీఆర్ ను కొనసాగించాలని అంటున్నారు. బిఆర్ఎస్ ఓడినప్పటి నుండి కేటీఆర్ లాంటి గొప్ప ఐటీ మంత్రిని తెలంగాణ కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. 
 

click me!