
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సర్కారుకు సరదాగా మారింది. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకదానికోకటి పోటీ పడుతున్నాయి. ఇటీవల కాలంలో విద్యార్థులు పరీక్షలకు భయపడటంలేదు. తాము రాసే పరీక్ష పేపర్ లీకైతే పరిస్థితి ఏంటా అని భయపడి పోతున్నారు.
సమర్థవంతంగా, పారదర్శకంగా పటిష్ట బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వాలు చెబుతూనే ఉంటాయి. క్షేత్రస్థాయికి వచ్చేసరికి పరిస్థితి మాత్రం పూర్తి రివర్స్ లో కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఎంసెట్ మెడిసన్ కు సబంధించి మాత్రమే ఈ లీకేజీ తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు ఏడవ తరగతి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ వరకు ఈ లీకేజీ జబ్బు వ్యాపించింది.
వాట్సాప్ లాంటి సోషల్ నెట్ వర్క్ యాప్ లు అందుబాటులోకి వచ్చాక లీకేజీ వీరులు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు.
పరీక్ష కేంద్రానికి చేరే లోపే పరీక్ష పత్రాలు లీకవడం వెనక పెద్ద మాఫీయానే నడుస్తోంది. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల పాత్ర ఇందులో ఉన్నది అనేది సుస్పష్టం. ఎగ్జామ్ సెంటర్ లలో ఇన్విజిలేటర్లను, ఇతర సిబ్బందిని మచ్చిక చేసుకోవడం వారికి కొంత ముట్టజెప్పడంతో ఈ లీకేజీ తంతు మొదలవుతోంది. వాట్సాప్ లో వారు క్వశ్చన్ పేపర్ ను బయటకు పంపడం వాటికి సమాధానాలు కూడా వాట్సాప్ తో తిరిగి పంపుతుండటం జరగుతోంది.
మొన్న తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పదవ తరగతి పరీక్షా ప్రశ్నాపత్రం ఇలానే వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాకెక్కింది. పరీక్ష మొదలైన కాసేపటికే పేపర్ లీకేజీ అయింది.దీనిపై పోలీసులు విచారణ చేపట్టినా ఇప్పటివరకు అసలు నిందితులను కనిపెట్టలేకపోయారు.
తాజాగా ఏపీలోనూ పదోతరగతి పరీక్షపత్రం లీకైంది. అక్కడ ఈ లీకేజీ వ్యవహారం కాస్త రాజకీయరంగు పులుముకుంటోంది. ఈ విషయాన్ని పక్కనపెడితే ఏడోతరగతి నుంచి డిగ్రీ వరకు ఈ పరీక్షపత్రాలు బయటకిరావడానికి వాట్సాప్ లాంటి సాంకేతికతే ప్రధానకారణంగా తెలుస్తోంది.
పరీక్ష హాల్ ల్లో కాదు పరీక్ష కేంద్రాల్లో కూడా విద్యార్థులు మాత్రమే కాకుండా సిబ్బంది కూడా ఎలాంటి కమ్యూనికేషన్ సాధనాలు తీసేకరాకుంటేనే ఈ లీకేజీలకు కాస్త అడ్డుకట్టవేసే అవకాశం ఉంటుంది. కానీ, ఆ దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.