సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గెలుపు అవకాశాలెన్ని? పోటీ ఆ ఇద్దరి మధ్యేనా?

By SumaBala Bukka  |  First Published Dec 26, 2023, 10:49 AM IST

ఇవి పేరుకు సింగరేణి ఎన్నికలే అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో లాగే ప్రచారం పోటాపోటిగా సాగింది. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్,  కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్ టియుసిల మధ్యే పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ :  సింగరేణి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షలా మారనున్నాయా? అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇప్పటికే పదేళ్ల సుదీర్ఘ పాలన అనంతరం ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని, ఓడిన చోటనే గెలిచి చూపించాలని అనుకుంటుంది. ఈ క్రమంలోని సింగరేణిలో జరిగే ఎన్నికలు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారాయి. డిసెంబర్ 27వ తేదీన సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.

సింగరేణి ఎన్నికలకు అంత ప్రాముఖ్యత ఎందుకు అంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెకు ముందుగా సింగరేణి నుంచే  సైరన్ మొదలయ్యింది. సింగరేణి మొత్తం తాము బొగ్గు బావుల్లోకి దిగబోమని ప్రకటించి..  ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలపడంతో అది ఉద్యమానికి ఊపిరిలూదినట్టయింది. అయితే, ఆ సమయంలో ఉద్యమ నేతలు ఇచ్చిన హామీలేవీ.. ఆ తర్వాత ఉద్యమ పార్టీ మంచి రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తీర్చలేక పోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించింది. 

Latest Videos

ఇవి పేరుకు సింగరేణి ఎన్నికలే అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో లాగే ప్రచారం పోటాపోటిగా సాగింది. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్,  కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్ టియుసిల మధ్యే పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలతోపాటు అక్కడ సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి కూడా పోటీలో ఉంది. అయితే, ఐఎన్టియూసీ, ఏఐటియుసి సంఘాల నేతల ప్రచారమే ఎక్కువగా సాగుతోంది. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి.

‘ప్రజాపాలన’లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తం - మంత్రి శ్రీధర్ బాబు..

ఇక టీబీజీకేఎస్ మొదట పోటీ నుంచి తప్పకుంటున్నట్టుగా ప్రకటించింది. టీబీజీకేఎస్ లో ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు బొగ్గుగని కార్మిక సంఘ నేతలు తమ రాజీనామా లేఖలు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో టీబీజీకేఎస్ కాస్త డీలా పడింది. కలవడానికి వచ్చిన నాయకులకు ఆమె కలవకుండా చాలాసేపు వెయిట్ చేయించింది. దీంతో ఈసారి  సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్  పోటీలో ఉండబోదన్నారు. అయితే,  కొద్ది గంటల్లోనే తాము కూడా పోటీలో ఉండబోతున్నట్లుగా మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. దీంతో  ఓటమి  భయంతోనే ఇది  జరిగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు కాంగ్రెస్ అనుబంధ సంస్థైన ఐఎన్టియుసిని గెలిపించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. పొంగులేటి, శ్రీధర్ బాబులు చురుగ్గా ప్రచారం చేశారు. అంతకుముందు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం కూడా వారం రోజులపాటు కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారానికి వెళ్లివచ్చారు. కోదండరాం మాట ఇక్కడ బాగా చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. 

ఇక, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, కాంట్రాక్టు కార్మికుల సమస్య పరిష్కారానికి హై పవర్ కమిటీ వేస్తామని, కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని హామీల వర్షం కురిపిస్తుంది. మరో అంశం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులో వెళ్లిన కమ్యూనిస్టులు ఇక్కడ విడిగా పోటీకి దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు ఈ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఏఐటీయూసీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

టిఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఒక అసిఫాబాద్లో తప్ప ఎక్కడా టిఆర్ఎస్ గెలవలేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.  సింగరేణి కార్మికుల అభివృద్ధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఆ తర్వాత దానికోసం చేసింది శూన్యం. పర్మినెంట్ ఉద్యోగాల సంఖ్య తగ్గించడం, కాంట్రాక్టు ఉద్యోగాలు పెంచడం.. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున వసూలు, కొత్తగా గనులను తెరవకపోవడం, ఓపెన్ కాస్ట్ గనులను మూయించకపోవడం.. కార్మికుల పిల్లలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు అందించకపోవడం లాంటి అనేక అంశాలు.. కార్మికుల్లో తీవ్ర అసహనానికి దారితీసాయి.

ఈ తీవ్ర వ్యతిరేకతే కాంగ్రెస్కు ఓటుగా మారింది. ఇప్పుడు నేరుగా సింగరేణి ఎన్నికలే కావడంతో.. బిఆర్ఎస్ కి మరోసారి ఓటమి తప్పదని అంటున్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులంతా మార్పు కోరుకుంటున్నారని ఐఎన్టీయూసీ గెలుపు ఖాయమని వినిపిస్తోంది. మరి చూడాలి.. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు రానుందో.
 

click me!