తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశాలున్నాయన్ని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ : తెలంగాణలో గత నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నాడు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జల సంధి ప్రాంతంలో అల్పపీడన ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారంనాడు వాయుగుండంగా మారుతుందని తెలిపింది.
రానున్న 48 గంటల్లో వాయువ్య దిశగా కదిలి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, జనగాంలలో వర్షాలు కురుస్తాయన్నారు.
undefined
తెలంగాణ ఎన్నికలు 2023 : చివరిరోజు ప్రచారంలో అగ్రనేతలు.. ఏఏ పార్టీల నుంచి ఎవరెవరు? ఎక్కడెక్కడ?
తమిళనాడులో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని చుట్టుపక్కల ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప వాయు పీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం ప్రకటించింది. నిజానికి ఈ అల్పపీడనం ఆదివారం ఏర్పడాల్సి ఉందని చెప్పుకొచ్చింది. కానీ ఒకరోజు ఆలస్యంగా కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్ర డైరెక్టర్ తెలిపారు. ఈనెల 29న అంటే బుధవారం నాడు ఈ అల్పపీడనం పడమర దిశగా ప్రయాణించి, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వాయుగుండం కారణంగా తూర్పు గాలులు వేగంగా వీస్తాయి. దీంతో సోమవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తమిళనాడు, కారైక్కాల్, పుదుచ్చేరి ప్రాంతాల్లో తేలిక పాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా రాబోయే 48 గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.