
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కర్ణాటక వరకు వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వివరించింది. ఈ ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. అయితే ఎండలతో సతమతవుతున్న జనాలకు.. చిరుజల్లులు కొంతమేర ఉపశమనం కలిగించేలా ఉన్నాయి.
ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడిందని వాతావరణ శాఖ చెప్పింది. రాగల 12 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం వెల్లడించింది. శ్రీకాకుళం, ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో అసని తుపాను కదులుతోంది. అయితే తుపాన్ ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఇక, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.