
న్యూఢిల్లీ: సాగు చట్టాల రద్దు డిమాండ్లతో రైతుల ధర్నా మొదలు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వరకు ‘ఖలిస్తాన్’ చర్చ తీవ్రంగా జరిగింది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మశాలలోని అసెంబ్లీ కాంప్లెక్స్ గేట్‌పై ఖలిస్తాన్ జెండాలు, గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలతో మరోసారి కలకలం రేగింది. ఇదే తరుణంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖలిస్తాన్ అనుమానిత టెర్రరిస్టులను పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్తాన్ నుంచి పంజాబ్ గుండా భారత్‌లోని పలు ప్రాంతాలకు ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు అనుమానిత ఉగ్రవాదులు తెలిపినట్టు పోలీసులు వివరించారు. ఈ వారంలోనే హర్యానాలోని కర్నాల్‌లో నలుగురు ఖలిస్తాన్ అనుమానిత టెర్రరిస్టులను అరెస్టు చేశారు.
దర్యాప్తులో అనుమానిత ఉగ్రవాదులు ఈ విషయాలను వెల్లడించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ల సహాయంతో గ్రెనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలను పంజాబ్‌కు తరలిస్తున్నారు. ఆ పేలుడు పదార్థాలను మూడు ప్రాంతాలకు పంపాలనే టాస్క్‌పై ఈ అనుమానిత ఉగ్రవాదులు పని చేస్తున్నారు. ఒకటి పంజాబ్‌లో అమృత్‌సర్- తర్న్ తరణ్ హైవే వద్దకు వీటిని తీసుకెళ్లడం. అక్కడే ఈ పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఉంచాలి. ఐఈడీలు, గ్రెనేడలకు సంబంధించిన రెండో కన్సయిన్‌మెంట్‌గా నాందేడ్- హైదరాబాద్ హైవే ఉన్నది. ఇక మూడో టార్గెట్ ప్లేస్‌గా తెలంగాణలోని ఆదిలాబాద్ ఉన్నది. ఆదిలాబాద్‌కు వారు ఈ పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుండగా ఈ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు.
అరెస్టు అయిన నిందితులు అమన్‌దీప్, గుర్‌ప్రీత్ మరిన్ని విషయాలను వెల్లడిస్తూ, పాకిస్తాన్‌కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ టెర్రరిస్టు హర్విందర్ సింగ్ అలియాస్ రిందా ఈ పేలుడు పదార్థాలు, ఆయుధాలు, గ్రెనేడ్లను డ్రోన్‌ల ద్వారా పంజాబ్‌కు చేరుస్తున్నాడని పేర్కొన్నారు. అంతేకాదు, అదే సరిహద్దు ద్వారా డ్రగ్స్ కూడా తరలిస్తున్నట్టు తెలిపారు. ఆ డ్రోన్‌ల ద్వారా డెలివరీ అయిన డ్రగ్స్‌ను అమ్ముకుని ఈ నిందితులను డబ్బు సమకూర్చుకుంటున్నారు. వారు ఆ డ్రగ్స్‌ను పంజాబ్‌లోని డ్రగ్స్ డీలర్లకు అప్పజెబుతారు. అలా వచ్చిన డబ్బును ఆయుధాలు, పేలుడు పదార్థాలను నిర్దేశిత ప్రాంతాలకు డెలివరీ చేయడానికి వినియోగిస్తున్నారు.
అయితే, వీటన్నింటికీ కేంద్రంగా కనిపిస్తున్న పంజాబ్ ప్రధాన డ్రగ్ స్మగ్లర్లు, హవాలా ఆపరేటర్ల కోసం కర్నాల్ పోలీసులు గాలిస్తున్నారు.
ఇటీవలే ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, ఉత్తర ప్రదేశల నుంచి ఐఈడీలను రెండు ఉగ్ర సంబంధ కేసుల్లో స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఆయుధాలు పాకిస్తాన్ నుంచి తొలుత పంజాబ్‌కు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు వచ్చినట్టు పేర్కొన్నారు.
కాగా, ఉగ్ర కుట్రను భగ్నం చేస్తూ కర్నాల్ పోలీసులు నలుగురు అనుమానిత ఖలిస్తానీ టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారు తెలంగాణకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను తీసుకుని వస్తుండగా హర్యానాలోని కర్నాల్‌లో మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను గుర్‌ప్రీత్, అమన్ దీప్, పర్మిందర్, భూపిందర్‌లు ఉన్నారు.