తెలంగాణ సీఎం కేసీఆర్ తో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు ఇవాళ భేటీ అయ్యారు. యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
హైదరాబాద్:భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసిసి) బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. సోమవారం నాడు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆద్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమైంది.
ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న బిజెపి చిచ్చు పెడుతుందని ఆయన విమర్శించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.విభిన్నప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇండియా చాటుతుందన్నారు.
undefined
యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని సీఎం తెలిపారు.
also read:యూసీసీని వ్యతిరేకిస్తామని కేసీఆర్ హామీ: అసద్
దేశ ప్రజల అస్థిత్వానికి వారి తర తరాల సాంప్రదాయ, సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా మారిన యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు సీఎం ను కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకురాదల్చుకున్న యూసిసి నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతుందన్నారు. దేశ ప్రజల సమస్యల పరిష్కరించడంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసిసి అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అని సిఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
ఈ విషయమై భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పార్లమెంట్ లో పోరాటం చేస్తామని కేసీఆర్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులకు తెలిపారు.ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్దం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులకు సిఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మతాలకు ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడేందుకు ముందుకు వచ్చినందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.
ఈ సమావేశంలో ఎంఐఎం అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్, బోర్డు కార్యవర్గ సభ్యలు, తదితరులు పాల్గొన్నారు.