యూనిఫాం సివిల్ కోడ్ పై ఎంఐఎం చీఫ్ అసద్ నేతృత్వంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కేసీఆర్ తో ఇవాళ భేటీ అయ్యారు.
హైదరాబాద్: యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు హిందువులకు కూడా మంచిది కాదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు సోమవారంనాడు కలిశారు. యూనిఫాం సివిల్ కోడ్ పై సీఎం కేసీఆర్ కు వినతి పత్రం సమర్పించారు. యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
యూసీసీతో గిరిజనులకు కూడ ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో గిరిజనులున్నారని ఆయన చెప్పారు. యూసీసీ బిల్లు విషయమై దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను కలుస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూసీసీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతును కూడగడుతామని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.యూసీసీ తెస్తే హిందూ వివాహ చట్టం కూడ రద్దు కానుందన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుతో భిన్నత్వాన్ని దెబ్బతీయాలని మోడీ చూస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అనే విషయాన్ని అసద్ గుర్తు చేశారు.సీఏఏకి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని అసద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.