బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఏ పార్టీతో బీఆర్ఎస్ కు పొత్తు ఉండుదని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 'సంపూర్ణ మెజారిీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమాను వ్యక్తం చేశారు. బుధవారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుండదని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీపై ఆధారపడదని ఆయన తేల్చి చెప్పారు. వామపక్షాలతో పొత్తు విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు.. కిషన్ రెడ్డి అంబర్ పేటలో ఏం అభివృద్ది చేశారో చర్చకు తమ ఎమ్మెల్యే వెంకటేష్ సిద్దంగా ఉన్నారన్నారు.
కడపలో స్టీల్ ప్లాంట్ భూమి పూజకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అనుమతిచ్చిందన్నారు. కానీ తెలంగాణ సచివాలయ ప్రారంభానికి మాత్రం అనుమతివ్వలేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తైన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు ఉంటుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్లు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలానికి కారణమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలను మాణిక్ రావు ఠాక్రే లైట్ గా తీసుకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహత్మకంగా పావులు కదుపుతుంది.