వచ్చే ఎన్నికల్లో 78 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంటాం: మాణికం ఠాగూర్ ధీమా

By narsimha lodeFirst Published Oct 31, 2021, 4:48 PM IST
Highlights

2023 ఎన్నికల్లో తెలంగాణలోని 78 అసెంబ్లీ స్థానాల్లో తాము విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ధీమాను వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
 


హైదరాబాద్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో Telangana రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 78 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ Manickam Tagore  ధీమాను వ్యక్తం చేశారు.మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పార్టీకి చెందిన ముఖ్య నేతలు, మండల పార్టీ అధ్యక్షుల సమావేశం ఆదివారం నాడు నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

also read:Huzurabad bypoll: ఈసీపై మండిపడ్డ మాణికం ఠాగూర్

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను తమ పార్టీ  సీరియస్‌గా తీసుకొందన్నారు. రెండు దఫాలు తెలంగాణ రాష్ట్రంలో  వరుసగా విజయం సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాణికం ఠాగూర్ విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టుగా ఠాగూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు అదుపు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 14 నుండి 21 వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో జన జాగరణ పాదయాత్రలను నిర్వహిస్తామన్నారు.

సంస్థాగతంపై దృష్టి

 Congress పార్టీని క్షేత్ర స్థాయి నుండి పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని మాణికం ఠాగూర్ చెప్పారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై కూడా  పార్టీ నేతలతో చర్చించినట్టుగా ఠాగూర్ తెలిపారు.నవంబర్ 1వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్ ను ప్రారంభిస్తామని ఠాగూర్ వివరించారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కూడ వరుసగా రెండు దఫాలు ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉంది.2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ ఇప్పటి నుండే వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఈ రెండేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు  పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు కట్టబెడతామని టీపీసీసీ చీఫ్ Revanth Reddy ప్రకటించారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నాలను చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు కేసీఆర్ వ్యతిరేకులను కూడా ఒకేతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అవకాశం దొరికితే బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య దోస్తీ ఉందనే ప్రచారాన్ని తీవ్రం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడితే కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం. దీంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ తో బీజేపీకి దోస్తీ అనే ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ,టీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. 

click me!