2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పోరాట స్పూర్తి: కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 29, 2020, 6:27 PM IST
Highlights

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల వరకే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా తాము పోరాటం కొనసాగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
 


హైదరాబాద్: దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల వరకే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా తాము పోరాటం కొనసాగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో వరదలు వచ్చిన సమయంలో తాను ప్రత్యక్షంగా పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వరదల్లో ప్రజలు బాధపడుతోంటే  సీఎం ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు.

వరదల కారణంగా  నగరంలో 40 మంది మరణిస్తే సీఎం ఒక్క కుటుంబాన్నైనా ఓదార్చారా అని ఆయన ప్రశ్నించారు. వరదల సమయంలో తనతో పాటు తమ పార్టీకి చెందిన నేతలు నగరంలో పర్యటించారని ఆయన గుర్తు చేశారు. 

హైద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఎందుకు వచ్చారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు.తమది కుటుంబపార్టీ కాదు, జాతీయ పార్టీ.. అంతేకాదు ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని ఆయన చెప్పారు. 

వాస్తవాలకు విరుద్దంగా టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఎల్లుండి నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు ఓటేయబోతున్నారని ఆయన చెప్పారు.

అమిత్ షా పర్యటనతో తమ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం వచ్చిందని ఆయన తెలిపారు. కేసీఆర్ కానీ, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళ, హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర అంశాల గురించి తాము లేవనెత్తిన అంశాలను ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

also read:అమిత్‌షాకి కేటీఆర్ కౌంటర్: నిజాం సంస్కృతి కాదు, విషం చిమ్ముతున్నారు

అవినీతి, కుటుంబ రాజకీయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని...ఎన్నికల ప్రచారంలో వెళ్లిన తమకు ఈ విషయం స్పష్టమైందన్నారు.ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. 

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల వరకే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా తాము పోరాటం కొనసాగిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.బీజేపీని గ్రామ గ్రామాన విస్తరిస్తామని ఆయన చెప్పారు. హైద్రాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన కోరారు.

click me!