'గ్రూప్-2 పరీక్షల వాయిదాపై 48 గంటల తర్వాత స్పష్టత': కొనసాగుతున్న ఆందోళన

By narsimha lode  |  First Published Aug 10, 2023, 2:38 PM IST

గ్రూప్-2 పరీక్షల వాయిదా  విషయమై స్పష్టత కోరుతూ  టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు  ఆందోళన కొనసాగుతుంది.  అయితే ఆందోళనకారులకు  నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు


హైదరాబాద్: గ్రూప్-2  పరీక్షల వాయిదా విషయమై  48 గంటల్లో వెబ్ నోటిఫికేషన్ ఇస్తామని  టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి గ్రూప్-2 అభ్యర్థులకు  సమాచారం ఇచ్చారు.  అయితే  గ్రూప్-2 పరీక్షల వాయిదా విషయమై  ఇవాళే స్పష్టత ఇవ్వాలని  వారు  కోరుతున్నారు.   టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు  బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు.  ఈ ఆందోళన నేపథ్యంలో  ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం నుండి పంపించేందుకు  పోలీసులు ప్రయత్నాలు  చేస్తున్నారు.గంట సేపు మాత్రమే  ఆందోళనకు  అనుమతిస్తే  మూడు గంటలుగా ఆందోళన నిర్వహించడంపై పోలీసులు  అసంతృప్తితో ఉన్నారు.  టీఎస్‌పీఎస్‌సీ వద్ద  ఆందోళన చేస్తున్న వారిని పంపేందుకు  అదనపు బలగాలను  కూడ పోలీసులు రప్పిస్తున్నారు.

ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీ  నిర్ణయం తీసుకుంది. అయితే  ఈ నెలలోనే గురుకుల, జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి  పరీక్షలున్నాయి. ఈ పరీక్షలతో పాటు  బ్యాంకు పరీక్షలు కూడ ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.  దీంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.

Latest Videos

also read:గ్రూప్-2 పరీక్ష వాయిదాకై: టీఎస్‌పీఎస్‌సీ వద్ద అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్తత

గ్రూప్-2 పరీక్షల సిలబస్ ను కూడ మార్చారని  అభ్యర్థులు గుర్తు  చేస్తున్నారు. దరిమిలా  పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తే  పరీక్ష నిర్వహించేందుకు  సరైన తేదీ లేదని  టీఎస్‌పీఎస్‌సీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ విషయమై  ఏం చేయాలనే దానిపై  టీఎస్‌పీఎస్‌సీ  తర్జన భర్జన పడుతుంది. ఇవాళ టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో  భేటీ అయిన అభ్యర్థులకు ఈ విషయాన్ని  స్పష్టం  చేశారు.  గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసే విషయమై   రెండు రోజుల్లో  వెబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అయితే  ఈ సమాధానంతో మాత్రం అభ్యర్థులు సంతృప్తి చెందలేదు.  అయితే  టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పేందుకు  పోలీసులు  ప్రయత్నిస్తున్నారు. డీసీపీ వెంకటేశ్వర్లు  ఆందోళనకారులతో చర్చిస్తున్నారు.

click me!