వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ దే గెలుపు.. 90-100 సీట్ల‌తో హ్యాట్రిక్‌ సాధిస్తాం.. : కేటీఆర్

By Mahesh Rajamoni  |  First Published Jun 2, 2023, 3:16 PM IST

Telangana assembly election: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విజ‌యంతో మ‌రోసారి తెలంగాణ‌లో అధికారం చేప‌డ‌తామ‌ని ఐటీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. 90 నుంచి 100 స్థానాల‌ను గెలుచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తంచేశారు. మ‌రోసారి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీఏం ప‌ద‌వి చేప‌డ‌తార‌ని అన్నారు. 
 


BRS working president KT Rama Rao: త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందనీ, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ధీమా వ్య‌క్తంచేశారు. గోషామహల్, దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను కూడా బీజేపీ నిలబెట్టుకోదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలని కూడా పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనీ, బీజేపీ వ్య‌తిరేక‌త‌తో ప్రభుత్వాన్ని గద్దె దించారని అన్నారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో ఎనిమిది మంది ముఖ్యమంత్రులు కర్ణాటకలో ప్రచారంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధాని పీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూసిందన్నారు.

తెలంగాణలో ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రశ్నించగా, వ్యక్తిగత పార్టీగా ఎన్ని సీట్లలోనైనా పోటీ చేసే స్వేచ్ఛ అంద‌రికీ ఉంటుంద‌ని తెలిపారు. మైనారిటీల సంక్షేమాన్ని నిర్ధారించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఆయన, అదే మజ్లిస్ అధినేత ఉత్తరప్రదేశ్ లో తన ప్రచారంలో మైనారిటీల సంక్షేమ చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమతుల్య వృద్ధికి కృషి చేస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశార‌ని తెలిపారు. ఛ‌త్తీస్ గఢ్ లో ఎకరాకు 12 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని గరిష్ఠ పరిమితి ఉండగా, తెలంగాణలో ఆ పరిమితి లేదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

Latest Videos

undefined

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలు తెలంగాణ మోడల్ కంటే మెరుగైన మోడల్ చూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులను తెస్తోందన్నారు. తెలంగాణ మోడల్ పాలనను పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్ కు బేషరతుగా మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాని కేటీఆర్ అన్నారు. ఎక్కువ ఆదాయం కోసం ఔటర్ రింగ్ రోడ్డు టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ మోడల్ కేటాయింపులో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ.. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కోరుతూ హెచ్ఎండిఎ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసు ఇచ్చిందని చెప్పారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కూడా క్షమాపణలు చెప్పాలంటూ ఆ సంస్థ పరువు నష్టం దావా వేసింది. ప్రతిపక్ష నేతలు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐ లేదా మరేదైనా సంస్థతో విచారణకు ఆదేశించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నేతల వద్ద ఏవైనా డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే చూపించవచ్చని తెలిపారు. కేవలం ఆరోపణలు చేస్తే సహించేది లేదనీ, ఇకపై నిరాధార ఆరోపణలు చేసే నేతలకు కూడా నోటీసులు జారీ చేస్తానని చెప్పారు. రాష్టంలో అభివృద్ధికి ఎల్లప్పుడూ అవకాశం ఉందన్నారు.

click me!