రాహుల్ గాంధీ సభకు ఆటంకాలు కల్పించడం లేదని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ ప్రకటించారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
ఖమ్మం: రాహుల్ గాంధీ సభకు ఎలాంటి ఆటంకాలు కల్పించడం లేదని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ ప్రకటించారు. ఇవాళ ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. తమ సభకు రాకుండా వాహనాలను అడ్డుకోవడం సరైంది కాదని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల చెక్ పోస్టులు, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు సుమారు 1700 వాహనాలను పోలీసులు సీజ్ చేశారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆందోళనకు దిగారు. రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తొలగించారు. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
also read:రాహుల్ గాంధీ సభకు అడ్డంకులు: ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు వీహెచ్ ఆందోళన
ఈ పరిణామాలపై ఖమ్మం సీపీ విష్ణు వారియర్ స్పందించారు. ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ సభకు ఆటంకాలు సృష్టించడం లేదన్నారు. కాంగ్రెస్ సభకు ఆటంకాలు సృష్టించడం లేదని తెలిపారు. రాహుల్ గాంధీ సభకు పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు.