Revanth Reddy: వ్యవసాయానికి 12 గంటలే ఇచ్చాం: సీఎం రేవంత్‌కు విద్యుత్ సంస్థల వివరణ

By Mahesh KFirst Published Dec 9, 2023, 5:32 AM IST
Highlights

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందలేదు. దఫాకు 6 గంటల చొప్పున రోజుకు రెండు దఫాల్లో 12 గంటలు సాగుకు కరెంట్ ఇచ్చామని విద్యుత్ సంస్థల అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. వారం రోజుల్లో మరోసారి భేటీ అవుతానని, ఆ తర్వాత శ్వేత పత్రం విడుదల చేద్దామని సీఎం చెప్పారు.
 

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజూ విద్యుత్ రంగ పరిస్థితిపై సమీక్ష జరిపారు. తొలి రోజున విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై సీఎం ఆగ్రహించిన సంగతి తెలిసిందే. వివరాలు దాచారని సీరియస్ అయ్యారు. దీంతో మరుసటి రోజు శుక్రవారం కూడా విద్యుత్ సంస్థల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో ఉన్నారు.

ఈ సమావేశంలో విద్యుత్ సంస్థల అధికారులు సంచలన విషయాన్ని వెల్లడించారు. వ్యవసాయానికి 12 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చామని చెప్పారు. సాగుకు రెండు దఫాల్లో కరెంట్ అందించామని, ఒక్కో దఫాకు 6 గంటల చొప్పున కరెంట్ ఇచ్చామని వివరించారు. దీంతో ఇక నుంచి 24 గంటల నిరంతరాయ కరెంట్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు.

Latest Videos

Also Read : CM Revanth Reddy: నడిరాత్రి నా ఇంటిపై లాఠీలు పడి.. నన్ను నిర్బంధించి.. : సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్

వారం రోజుల్లో మరోసారి తాను భేటీ అవుతానని, ఆ తర్వాత శ్వేతపత్రం విడుదల చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లు చేసిన అప్పులు, వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు కలుపుకుని మొత్తంగా రూ. 81,516 కోట్ల అప్పు ఉన్నదని అధికారులు తెలిపారు. ఇందులో కరెంట్ కొనుగోళ్లకు రూ. 30,406 కోట్లు, 2014 నుంచి 2023 మధ్యకాలంలో డిస్కమ్‌లు చవిచూసిన నష్టాలు రూ. 50,275 కోట్ల వరకు ఉన్నాయని వివరించారు.

వీటికితోడు కాంగ్రెస్ పార్టీ గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఏటా రూ. 4,008 కోట్ల భారం అయ్యే అవకాశం ఉన్నదని అంచనా వెల్లడించారు.

click me!