రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారులపై ఉద్యమ కేసులు ఎత్తేయాలని ఆదేశించింది. దీంతో ఉద్యమకారులపై ఉద్యమానికి సంబంధించి నమోదైన అన్ని కేసులను సమర్పించాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ రవి గుప్తా ఆదేశించారు.
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా తమదైన ముద్ర వేసే పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో రెండింటిపై నిర్ణయం తీసుకోడం, ప్రగతి భవన్‌ను జ్యోతిభా ఫూలే ప్రజా భవన్‌గా మార్చి ప్రజా దర్బార్ నిర్వహించడం వంటివి ఈ మార్పును ఎత్తిపడుతున్నాయి. తమది ప్రజా ప్రభుత్వం అనే సంకేతాలు బలంగా వెళ్లేలా రేవంత్ సర్కారు పావులు కదుపుతున్నది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్‌పైనా తెలంగాణ ఉద్యమకారుల్లో కొంత వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా అలాగే కొనసాగుతుండటాన్ని వారు తప్పుబడుతున్నారు. ఉద్యమ కేసులను ఎత్తేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ ఆదేశాలతో ఉద్యమకారులందరిపైనా కేసులు రద్దు కాలేవు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2009 నుంచి రాష్ట్ర సిద్ధించిన 2014 జూన్ 2వ తేదీ వరకు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తేయాలని ఆదేశించింది.
Also Read: TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..
ప్రభుత్వ ఆదేశాలు వెలువడగానే డీజీపీ రవిగుప్తా రంగంలోకి దూకారు. మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటం 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు అన్నింటినీ సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ కేసులు ఎత్తేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉద్యమకారులు స్వాగతిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.