ఉమ్మడి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ వద్ద కారు దగ్దం కేసులో డ్రైవర్ మృతి చెందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ ప్రకటించారు.
హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వెంకటాపూర్ వద్ద కారు దగ్దం కేసులో మృతి చెందింది డ్రైవర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. తాను చేసిన అప్పులను తీర్చేందుకు చనిపోయినట్టుగా నాటకమాడి ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేయాలని ధర్మానాయక్ ప్లాన్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మానాయక్ ప్లాన్ కు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
2022 డిసెంబర్ మాసంలో ధర్మానాయక్ సెకండ్ హండ్ కారును కొనుగోలు చేశాడు. ధర్మానాయక్ కు సరిగా డ్రైవింగ్ కూడా రాదు. కానీ కారు కొనుగోలు చేశాడు. తన కారు డ్రైవింగ్ కోసం ఓ వ్యక్తిని ధర్మానాయక్ నియమించుకున్నాడని సమాచారం. ప్రతి రోజూ అతినికి రూ. 1000 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం సాగుతుంది. ఈ నెల 5వ తేదీన కుటుంబసభ్యులతో ధర్మానాయక్ తన స్వగ్రామం భీమ్లాతండాకు వచ్చాడు. తన కారులో బాసరకు వెళ్లాడు. కారులో అల్లుడితో పాటు ధర్మానాయక్ కూడా వెళ్లాడు . బాసరలో సరస్వతి అమ్బవారిని దర్శించుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో టేక్మాల్ మండలం వెంకటాపూర్ వద్ద డ్రైవర్ ను హత్య చేసి కారును దగ్దం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుండి ధర్మానాయక్ వెళ్లిపోయినట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఆన్ లైన్ గేమ్, బెట్టింగ్ కారణంగా ధర్మానాయక్ రూ. 2 కోట్లు అప్పులు చేశాడు. ఈ అప్పులను తీర్చేందుకు ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గతంలోనే ధర్మానాయక్ రూ. 7 కోట్లకు ఇన్సూరెన్స్ చేశాడు. రూ. 2 కోట్లు అప్పులు తీర్చినా మిగిలిన డబ్బులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం సాగించవచ్చని ధర్మానాయక్ భావించాడు. తన ప్లాన్ ను ధర్మానాయక్ కుటుంబ సభ్యులకు చెప్పి డ్రామా ఆడారా లేదా అనే విషయమై పోలీసులు తమ దర్యాప్తులో తేల్చనున్నారు. మూడు రోజుల క్రితం ధర్మానాయక్ తన భార్యకు ఫోన్ చేశాడు. డెత్ సర్టిపికెట్ తీసుకోవాలని భార్యకు చెప్పారు. దీంతో ఈ దిశగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. పుణెలో ఉన్న ధర్మానాయక్ ను పోలీసులు గుర్తించారు.
ధర్మానాయక్ బతికే ఉన్నాడు: మెదక్ ఎస్పీ
తెలంగాణ సచివాలయంలో ఎఎస్ఓగా పనిచేస్తున్న ధర్మానాయక్ కారు దగ్దం కేసులో మృతి చెందలేదని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. ధర్మానాయక్ ను అదుపులోకి తీసుకున్నామని మెదక్ ఎస్పీ ప్రకటించారు. ధర్మానాయక్ ప్లాన్ ఏమిటనే విషయమై విచారిస్తున్నామన్నారు. ఈ విషయమై పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టుగా ఎస్పీ చెప్పారు.