ఎమ్మెల్యే ప్రలోభాల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు.సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కేసీఆర్ సర్కార్ సవాల్ చేసింది. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారిస్తే తాము ఎందుకు భయపడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని విపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ఆయన కోరారు.
న్యాయపరంగా తమకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ఫిర్యాదుదారుడిని దొంగే అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ కేసులో సిట్ విచారణకు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఎందుకు సహకరించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నోటీసులపై ఎందుకు హైకోర్టుకు వెళ్లి స్టే లు తచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు.