జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. తనకు అడ్డుగా నిలిచిన రామకృష్ణయ్యను హతమార్చాలని అంజయ్య నిర్ణయించుకున్నాడని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ మీడియాకు వివరించారు. ఐదుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్ రామకృష్ణయ్యను హత్య చేసినట్లు తెలిపారు. ఈ గ్యాంగ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వారి నుంచి కారు. 3 సెల్‌ఫోన్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గురబోయిన అంజయ్య భూములకు సంబంధించి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని సీపీ తెలిపారు. ఈ క్రమంలోనే సర్వే నెంబర్ 174 భూములపై రామకృష్ణయ్య ఫిర్యాదు చేశారని కమీషనర్ వెల్లడించారు.
తనకు అడ్డుగా నిలిచిన రామకృష్ణయ్యను హతమార్చాలని అంజయ్య నిర్ణయించుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనకు పరిచయస్తుడైన తిరుపతితో రూ.8 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడని , తిరుపతి మరో ముగ్గురు శ్రీకాంత్, భాస్కర్, రాజుల సాయంతో హత్యకు కుట్ర పన్నినట్లు సీపీ చెప్పారు. పథకంలో భాగంగా ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటలకు పోచన్నపేట వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారని రంగనాథ్ వెల్లడించారు. అనంతరం చిన్నరామన్చర్ల గ్రామ శివార్లలో రామకృష్ణయ్య మెడకు టవల్ బిగించి హతమార్చారని సీపీ చెప్పారు.
అనంతరం మృతదేహాన్ని చంపక్‌హిల్స్ అటవీ ప్రాంతంలోని క్వారీ నీటి గుంతలో పడేశారని కమీషనర్ వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా అంజయ్యను పోలీసులు విచారించగా.. హత్య విషయం వెలుగుచూసిందని సీపీ తెలిపారు. అంజయ్య గతేడాది అక్టోబర్‌లోనూ సుభద్ర అనే మహిళను కూడా ఇలాగే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు సీపీ రంగనాథ్ చెప్పారు. పరారీలో వున్న తిరుపతి, రాజులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.