అసెంబ్లీలో కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ

By narsimha lodeFirst Published Sep 22, 2019, 12:38 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పై టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 

హైదరాబాద్: రాజ్యాంగ బద్దంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో విలీనమయ్యారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ అని  కేసీఆర్ తేల్చి పారేశారు. రాష్ట్రానికి ఓ రాజ్యాంగం ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు  మల్లు భట్టి విక్రమార్క విమర్శలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు.

తమ పార్టీలో చేరుతామని  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరుతామని  లేఖలు రాశారు, అంతేకాదు అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. ఈ లేఖలు కూడ తనకు వచ్చాయన్నారు. తనను కలిసిన ఎమ్మెల్యేలను కూడ పార్టీలో చేరుతామని చెబితే తాము ఒప్పుకోలేదన్నారు.

సుమారు 12 మంది ఎమ్మెల్యేలు విలీనమైతే అనర్హత వేటు నుండి తప్పించుకొనే అవకాశం ఉందని  చెబితే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది  తమ పార్టీలో విలీనమైనట్టుగా కేసీఆర్ చెప్పారు.

రాజస్థాన్ లో ఆరుగురు బిఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారన్నారు.గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారని ఉప రాష్ట్రపతి బులెటిన్ కూడ విడుదల చేశారని  ఆయన గుర్తు చేశారు.

ఎమ్మెల్యేలు, ఎంపీల విలీనం విషయంలో  రాష్ట్రానికో రూల్ ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్ లో మీరు చేసింది కరెక్టే అయితే తెలంగాణలో కూడ సరైందేనని కేసీఆర్ సమర్ధించారు. 

ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకొన్నారు. తమ పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు రోజుకో రకంగా  రాజీనామా చేస్తామని ప్రకటించారు. అంతేకాదు టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించారని మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

ఈ విషయమై తాము రెండు పిటిషన్లను స్పీకర్ కు ఇచ్చామన్నారు. మొదటి విడతలో  చర్యలు తీసుకొంటే 7 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉండేదన్నారు. రెండొ పిటిషన్‌పై చర్యలు తీసుకొంటే మరో నలుగురు ఎమ్మెల్యేలు పదవులు కోల్పోయే అవకాశం ఉండేదన్నారు. కానీ ఈ రెండు  పిటిషన్లను స్పీకర్ చర్యలు తీసుకోలేదన్నారు.

ఈ విషయమై సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గాలి పిటిషన్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ తమదన్నారు. నైతికత గురించి కాంగ్రెస్ నుండి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కేసీఆర్ మల్లు భట్టి విక్రమార్కకు కౌంటరిచ్చారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో  టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. 


 

click me!