
వికారాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌లో (TRS) వర్గపోరు మరోసారి బయటపడింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) సమక్షంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇరువురు నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈఘటన తాండూరులో చోటుచేసుకుంది. వివరాలు.. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy), ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిల (patnam mahender reddy) మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన రోహిత్ రెడ్డి.. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఏర్పాటైన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే రోహిత్ రెడ్డి పార్టీలో చేరడంపై తొలి నుంచి అయిష్టంగా ఉన్న మహేందర్ రెడ్డి కొన్ని సందర్భాల్లో తన వైఖరిని బహిరంగంగానే వ్యతిరేకించారు. గతంలో మంత్రిగా తాండూరులో అన్ని తానై వ్యవహరించిన మహేందర్ రెడ్డి ఈ పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారనే ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే అధిష్టానం కూడా ఇరువురు నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
అయితే తాజాగా తాండూరులో శుక్రవారం దోమల నివారణ యంత్రాల పంపిణీ కార్యక్రమంల జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే వేదికపైనే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసింది. ఈ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వలేదని మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి వర్గీయుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. సబితా ఇంద్రారెడ్డి ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు.
అయిన కూడా ఇరువర్గాలు వినిపించుకోకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాల మధ్య పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు.