తెలంగాణలో మరో రైతు సీఎం కేసీఆర్ కు లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలంలోని యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం వరి సాగు చేయొద్దని ప్రకటించడంతో ఆందోళన గురయిన రైతు.. గురువారం సాయంత్రం పురుగుల మందు తాగి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Farmer commits suicide: వరి పంట సాగు వేయొద్దంటున్నందుకు తెలంగాణలో మరో రైతు అశువులు బాశాడు. నేరుగా సీఎం కేసీఆర్ కు లేఖ రాసి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వివాద ఘటన మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హావేలిఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ లో రైతు కర్ణం రవి కుమార్. ఆయన పొలానికి నీళ్లు సౌకర్యం ఉంది. దీంతో వర్షాకాలంలో ప్రభుత్వం చెప్పినట్టు సన్నరకం వరి వేశాడు. కానీ, ఊహించని విధంగా. దిగుబడి తక్కువగా వచ్చింది. అయినా సరే.. పంటకు సరైన మద్దతు రాకపోదా అని చూశాడు. కానీ, దొడ్డు రకం వడ్లు వచ్చిన ధరనే సన్నాలు లభించింది. సరేలే అని సర్దుకుపోయాడు. యాసంగి లో పుష్కలమైన నీరు ఉంది.. మంచి దిగుబడి వస్తోందని సాగు చేయాలని భావించాడు.
కానీ తెలంగాణ సర్కార్ .. ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయొద్దని సంచలన ప్రకటన చేసింది. దీంతో ఏం పండించాలనేది అర్థం కాని గందరగోళం పడ్డారు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో పురుగుల మందు తాగి రైతు కరణం రవికుమార్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఈ క్రమంలో తన బాధను వ్యక్తపరుస్తూ.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు.
ఆ లేఖలో ఏం రాశాడంటే..
’ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు యాసంగిలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. తనను ఇంజినీరింగ్ చదివియ్యాలె’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో రవికుమార్ పేర్కొన్నాడు.
ఆ గ్రామంలో రైతు ఆత్మహత్య ఉదంతం విషాదం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు కరణం రవికుమార్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికుల కథనం ప్రకారం.. రవికుమార్ కు 3.5 ఎకరాల భూమి ఉంది. తన మొదటి కుమార్తె పెళ్లి కోసం 30 గుంటలు భూమి అమ్మి వేశాడు. మరోవైపు తన కుమారుడు సాయికిరణ్ కు హిమోపోలియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. సాయి కిరణ్ కోసం ఇప్పటి వరకూ దాదాపు రూ. 18 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించాడు. వ్యవసాయంలో సరైన దిగుబడి రాగా.. రవి అప్పుల పాలయ్యాడని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం వరి సాగు చేయొద్దని ప్రకటించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
నిజంగా.. తెలంగాణ సర్కార్.. యాసంగిలో వరి సాగు చేయొద్దని ప్రకటించడంతో రైతాంగం.. గందరగోళంలో పడింది. సాధారణ రైతులతోపాటు కౌలు రైతుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వరి కాకుండా ఏం పంటలు సాగు చేయాలనే దానిపై సతమతపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనీ.. వరి సాగు చేస్తే.. ప్రభుత్వం ధాన్యం కొంటుందో లేదో ఆ తర్వాత పెట్టుబడి నష్టపోతామా ? అన్న మీమాంసలో పడిపోయారు రైతులు.