
వనపర్తి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించారు. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేయనునున్నట్టుగా చెప్పారు. లోక్‌నాథ్ రెడ్డితో పాటు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, కొందరు సర్పంచ్‌లు కూడా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టుగా వెల్లడించారు. సొంత పార్టీలోనే అవమానాలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పనిచేయడం కష్టమని పేర్కొన్నారు.
అయితే మంత్రి నిరంజన్‌రెడ్డితో విభేదాల కారణంగానే వీరంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మంత్రి నిరంజన్ రెడ్డి వైఖరితో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పదవులకు రాజీనామా చేసే విషయంలో లోక్‌నాథ్ రెడ్డితో పాటు మిగిలిన నాయకులు స్పష్టత ఇవ్వలేదు. అయితే త్వరలోనే తమ కార్యచరణను ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు.