
నిర్మల్ జిల్లాలో కలెక్టర్ (nirmal district collector) టెన్నిస్ (tennis) విధుల కోసం వీఆర్ఏలకు డ్యూటీ వేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సాయంత్రం వేళల్లో కలెక్టర్ బంగ్లా వద్ద టెన్నిస్ బంతులు అందించేందుకు విధులకు హాజరవ్వాలని 21 మంది వీఆర్ఏలకు డ్యూటీలు వేశారు. దీనిపై వివాదం రేగడంతో నిన్న వీఆర్ఏలు లేకుండా టెన్నిస్ ఆడారు కలెక్టర్. అయితే గురువారం మరోసారి నిర్మల్ టెన్నిస్ కోర్టుకు వచ్చారు నలుగురు వీఆర్ఏలు. అయితే ఇంత వరకు కలెక్టర్ అక్కడికి రాలేదు. ఎవరు టెన్నిస్ ఆడినా బాల్స్ అందిస్తామని వీఆర్ఏలు చెబుతున్నారు. ప్రతిరోజూ డే అంతా డ్యూటీ చేస్తామని.. సాయంత్రం టెన్నిస్ కోర్టు వద్ద డ్యూటీలు వేస్తామని వీఆర్ఏలు అంటున్నారు. నెట్ మధ్యలో ఇద్దరం, వెనకాల ఇద్దరం నిలబడి బాల్స్ అందిస్తామని వారు చెప్పారు.
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ (Musharraf Faruqui) ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వెనకే ఉన్న గ్రౌండ్‌లో సహచర అధికారులతో కలిసి టెన్నిస్ ఆడతారు. కలెక్టర్ టెన్నిస్ ఆడే సమయంలో కోర్టు వద్ద బంతులు అందించేందుకు రోజుకీ ముగ్గురు చొప్పున వారానికి 21 మంది వీఆర్‌ఏలకు తహసీల్దార్ స్పెషల్ డ్యూటీ వేశారు. వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్‌వోలను నియమిస్తూ సోమవారం డీ/777/2020 నంబర్‌తో ఆదేశాలు జారీ చేశారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది. కలెక్టర్ ఆదేశాలతోనే తహసీల్దార్ ఈ జాబితా రూపొందించారా, లేక తహసీల్దారే అత్యుత్సాహంతో జాబితాను విడుదల చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వీఆర్‌ఏలకు విధులు అప్పజెప్పడంపై వివాదం చేలరేగడంతో వీఆర్‌ఏలను కలెక్టర్ వెనక్కి పంపారు. వీఆర్‌ఏలు లేకుండా బుధవారం టెన్నిస్ ఆడారు.