తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రేపు బీఆర్ఎస్‌లోకి చేరబోతున్నట్టు సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో రేపు ఉదయం 11.30 గంటలకు ఆయన గులాబీ కండువా కప్పుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారనున్నట్టు సమాచారం. ఆయన టీడీపీ వదిలి బీఆర్ఎస్‌లో చేరనున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ చేరికకు వేదిక, ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.
భద్రతా కారణాల దృష్ట్యా ఆయన తన అనుచరులను పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమానికి తీసుకెళ్లబోతున్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో రేపు కాసాని జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి.
టీటీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఆయనకు రుచించలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్వయంగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అభ్యర్థుల కసరత్తు కూడా ఆయన ప్రారంభించారు. కానీ, అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో కలత చెందారు.
రాజమండ్రి జైలులో ఉండగా చంద్రబాబుతో ములాఖత్ అయినప్పుడు ఈ నిర్ణయాన్ని బాబు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మరోసారి ఈ నిర్ణయంపై మాట్లాడటానికి అవకాశం ఉన్నదని ఆయన చెప్పినట్టూ అప్పుడు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై నారా లోకేశ్‌కు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కాసాని చిన్నబోయినట్టూ తెలిసింది. తాజాగా, ఆయన ఈ అసంతృప్తితోనే గులాబీ గూటికి చేరే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
Also Read : బీజేపీ బీసీ నినాదం.. బీసీల సభకు ప్రధాని మోడీ.. ప్రచారంలోనూ బీసీ నినాదమే ప్రధాన అస్త్రం !
బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నది. అధికారం వచ్చాక ఏదేని నామినేటెడ్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఇతర పార్టీల్లోని పలువురు కీలక నేతలను పార్టీ లోకి చేర్చుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.