కరోనా భయం: ఆన్‌లైన్‌లో పురోహితుడి మంత్రాలు, వధువు మెడలో తాళి కట్టిన వరుడు

By narsimha lodeFirst Published May 5, 2021, 4:16 PM IST
Highlights

కరోనా భయంతో  ఆన్‌లైన్‌లో పురోహితుడు వేదమంత్రాలు చదవగా వధువు మెడలో వరుడు తాళి కట్టారు. ఈ పెళ్లి మెదక్ జిల్లాలో బుధవారం నాడు జరిగింది.
 

మెదక్: కరోనా భయంతో  ఆన్‌లైన్‌లో పురోహితుడు వేదమంత్రాలు చదవగా వధువు మెడలో వరుడు తాళి కట్టారు. ఈ పెళ్లి మెదక్ జిల్లాలో బుధవారం నాడు జరిగింది.మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం సోమ్లాలో బుధవారం నాడు పెళ్లి జరిగింది. అయితే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధూవరులు కూడ పెళ్లి మండపానికి చేరుకొన్నారు.

పెళ్లి తంతు జరపడానికి పూజారి పెళ్లి మండపానికి రావాల్సి ఉంది. అయితే  అదే సమయానికి పెళ్లి జరిగే పక్క వీధిలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో తాను పెళ్లి జరిపించేందుకు రానని పురోహితుడు తేల్చి చెప్పాడు. బతిమిలాడినా కూడ ఆయన వినలేదు.దీంతో వధూవరుల తల్లిదండ్రులు సమావేశమై ఓ నిర్ణయం తీసుకొన్నారు. వీడియో కాల్ లో పురోహితుడు వేద మంత్రాలు చదువుతుండగా పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరిగింది. తన ఇంట్లోనే పురోహితుడు ఫోన్ లో వధూవరులకు సూచనలు ఇస్తుండగా వధూవరులు పాటించారు. 

గత ఏడాది కూడ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆన్ లైన్ వేదికగా వివాహలు జరిగాయి. వీడియా కాల్స్ లో పెళ్లిళ్లు జరిగాయి.ముందుగా నిర్ణయించుకొన్న షెడ్యూల్ ప్రకారంగా పెళ్లి జరిపించాలనుకొన్నవారు వీడియోకాల్స్ ద్వారా పెళ్లిళ్లు జరిపించారు. ఈ ఏడాది కూడ కరోనా ప్రభావం పెళ్లిళ్లు, ఫంక్షన్లపై పడే అవకాశం లేకపోలేదు. 

click me!