కేసీఆర్ కు భారీ షాక్: కాంగ్రెసులోకి గడ్డం వినోద్

By pratap reddyFirst Published Oct 16, 2018, 10:17 AM IST
Highlights

వినోద్ చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి, వివేక్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2016లో టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది. అయితే, వచ్చే ఎన్నికల్లో చెన్నూరు టికెట్ ను వినోద్ ఆశించారు.

హైదరాబాద్: దివంగత నేత జి. వెంకటస్వామి తనయుడు గడ్డం వినోద్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.  తాను కాంగ్రెసులో చేరడానికి తగిన ఏర్పాట్లను ఆయన చేసుకున్నట్లు తెలుస్తోంది.

దసరాకు ముందే ఆయన కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ నెల 20వ తేదీన భైంసాలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెసులో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆయన సోదరుడు వివేక్ కూడా కాంగ్రెసులో పార్టీలో చేరుతారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

తన సోదరుడి నిర్ణయం కోసమే వినోద్ వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో వినోద్, వివేక్ 2013 జూన్ 2వ తేదీన కాంగ్రెసును వీడి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత 2014 ఏప్రిల్ ఎన్నికలకు పక్షం రోజుల ముందు తిరిగి కాంగ్రెసులో చేరారు.

వినోద్ చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి, వివేక్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2016లో టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది. అయితే, వచ్చే ఎన్నికల్లో చెన్నూరు టికెట్ ను వినోద్ ఆశించారు. కానీ, కేసిఆర్ మరోలా భావించి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కు చెన్నూరు టికెట్ కేటాయించారు. దాంతో వినోద్ లో అసంతృప్తి చోటు చేసుకుంది. 

అయితే, వినోద్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని కేసిఆర్ తనయుడు కేటిఆర్ హామీ ఇచ్చారు. తన సోదరుడికి చెన్నూరు టికెట్ ఇస్తే పెద్దపల్లి సీటును వదులుకుంటానని వివేక్ కేటీఆర్ కు చెప్పారు. అయితే, బెల్లంపల్లిత ,చొప్పదండి, వికారాబాద్ ల్లో ఏదైనా ఒక సీటు నుంచి శాసనసభకు పోటీ చేస్తానని చెప్పారు. దీనిపై కేటీఆర్ నుంచి ఏ విధమైన హామీ రాకపోగా, కేసీఆర్ అపాయింట్ మెంటు కూడా వారికి లభించలేదు. 

ఈ నేపథ్యంలో వినోద్ కాంగ్రెసులోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వివేక్ మాత్రం ఇంకా సంశయంతో ఉన్నట్లు తెలుస్తోంది. తాను వివేక్ తో మాట్లాడుతున్నానని, త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని కూడా వినోద్ అన్నారు. 

click me!