
మేడ్చల్ : తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారం గ్రామంలో వివిధ అభివృద్ది పనులు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు స్థానిక సమస్యలను మంత్రికి తెలియజేస్తూ నిరసనకు దిగారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న సమస్యలను పరిష్కరించడంలేదంటూ గ్రామస్తులు మంత్రికి తెలిపారు.
గ్రామస్తులు మంత్రి మల్లారెడ్డికి సమస్యల గురించి చెబుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారికి పక్కకు తోసేసి మంత్రిని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు మద్య తోపులాట జరిగింది. గ్రామస్తులు మంత్రికి వ్యతిరేక నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల మద్యే మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అక్కడినుండి తీసుకునివెళ్లారు.
Read More ఆయనో అవినీతి తిమింగళం.. నా దగ్గర పుస్తకమే వుంది, బయటపెడతా : కడియంపై రాజయ్య సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూరులో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఒక్కరికి కూడా దళిత బంధు అందలేదంటూ దళితులు ఆందోళనకు దిగారు. గంగులను అడ్డుకున్న గ్రామస్తులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. చివరకు అందరికీ దళిత బంధు అందేలా చూస్తానని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇవ్వడంతో దళితులంతా శాంతించి ఆందోళనను విరమించారు.