
ముఖ్యమంత్రి కెసి ఆర్ కూతురు, నిజాంబాద్ ఎంపి కవితకు అరుదైన గౌరవం లభించింది.
ఎప్పటినుంచో వస్తున్న తమ గ్రామంపేరును మార్చి, కవితపేరు పెట్టుకోవడానికి ఖానాపూర్ గ్రామ ప్రజలు ముందుకొచ్చారు.
ఇలాంటి గౌరవం అందరికీ దొరకదు. సాధారణంగా, ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలిప్పించినపుడు, ఇందిరమ్మ ఇళ్ల కట్టించినపుడో లేదా నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఖర్చు చేసి రోడ్డో బ్రిడ్జో కట్టించినపుడో ఎమ్మెల్యే లేదా మంత్రుల పేరుతో కాలనీలు పుట్టు కొస్తుంటాయి. ఇది కూడా చాలా అరుదు.
అయితే, శతాబ్దాలుగా ఉన్న పేరును తీసేసి గ్రామానికి ఒక ఎంపి పేరు పెట్టుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కడా జరగనలేదు. ఆర్మూర్ మండలానికి చెందిన ఈ ఖానాపూర్ అదివారం నాడు కవితాపూర్ గా మారిపోయింది.
సమైక్యాంధ్ర పాలకులు విస్మరించిన బతుకమ్మ పండుగ ను పునరుద్ధరించడమేకాదు, దాన్నొక తెలంగాణా సంబురంగా మార్చి, మహిళలను తెలంగాణా ఉద్యమంలోకి విజయవంతంగా సమీకరించినందుకు నిజమయిన అవార్డు ఖానాపూర్ ను కవితాపూర్ గా మార్చడమే నని గ్రామస్థులు భావించారు. ఆ పని పూర్తి చేశారు.
తమ ఊరికి కవితాపూర్‌గా మార్చుకుంటున్నామని, దానికి అధికారికంగా అనుమతులు ఇప్పించాలని కోరుతూ గ్రామ సభ తీర్మానం కూడా చేసింది. ఈ ప్రతులను ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి అందజేశారు.
తొందర్లోనే గ్రామ పేరు మార్పిడికి సంబంధించి ప్రక్రియ మొదలుపెడతారని సమావేశంలో నాయకులు చెప్పారు.
తెలంగాణ ఆడపడుచు కల్వకుంట్ల కవిత పేరును ఖానాపూర్ గ్రామానికి పెట్టుకోవడం ఆర్మూర్‌కే గర్వకారణమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి అందించారు. ఖానాపూర్ గ్రామాన్ని కవితాపూర్‌గా మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మంచిపనులు చేసే నేతలను ప్రజలు మర్చిపోరనేందుకు ఖానాపూర్ ప్రజల నిర్ణయం నిదర్శనమని ఆయన అన్నారు.