విజయశాంతి పార్టీ మారడం కన్ఫామ్? స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దక్కని చోటు

By Mahesh K  |  First Published Nov 6, 2023, 3:13 PM IST

విజయశాంతి పేరును బీజేపీ స్టార్ క్యాంపెయిన్ జాబితాలో చేర్చలేదు. ఆమెకు ఏ స్థానంలోనూ టికెట్ ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే చేసిన ట్వీట్‌తో రాములమ్మ పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తున్నది. 
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొంచెం వెనుకబడే ఉన్నది. 88 స్థానాల్లో మాత్రమే టికెట్లు ప్రకటించిన బీజేపీ.. మిగిలిన స్థానాలపై కసరత్తు చేస్తూనే ప్రచారంపైనా దృష్టి సారించింది. ప్రధాని మోడీ రెండు మార్లు తెలంగాణకు రాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే.. తెలంగాణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ఖరారు చేసుకుంది. జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల్లోని కీలక నేతలు, తెలంగాణ రాష్ట్ర నేతలతో మొత్తం 40 మందితో క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. 40 మందిలో తెలంగాణకు చెందిన నేతలు 19 మందే ఉండటం గమనార్హం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ జాబితాలో విజయశాంతి పేరు లేదు.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో విజయశాంతి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక సొంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. కానీ, ఆ తర్వాత ఆ పార్టీలోని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. అనంతరం, కాంగ్రెస్‌లోకి, ఆ తర్వాత బీజేపీలోకి విజయశాంతి మారారు.

Latest Videos

Also Read: బీజేపీ ‘హంగ్’ ఆశలు? ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

బీజేపీలో సుదీర్ఘకాలం నుంచే ఆమె కొనసాగుతున్నారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి ఆమె పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇటీవలే పార్టీని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కీలక నేతలు రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటివారి దారిలోనే విజయశాంతి కూడా ఉన్నట్టు ఇప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఆమె చేసిన ఓ ట్వీట్ కూడా కారణంగా ఉన్నది. కొంతమంది కాంగ్రెస్‌లో ఉండమంటున్నారని, మరికొందరు బీజేపీలో ఉండమంటున్నారని, రెండు పార్టీల లక్ష్యం తెలంగాణ మేలే అని ఆమె ట్వీట్ చేశారు. అయితే.. సినిమాల్లోలా డబుల్ యాక్షన్ ఇక్కడ కుదరదు అని కామెంట్ చేయడంతో ఆమె కాంగ్రెస్‌లోకి మారుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమెను పార్టీలోకి తీసుకురావడానికి బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: BJP -JANASENA: పొత్తయితే కుదిరింది.. మరీ ప్రచారం సంగతేంటీ ? జనసేనానికి ఎదురయ్యే తిప్పలేంటీ?

ఇదిలా ఉండగా బీజేపీ కూడా ఆమెకు ముఖ్యమైన పదవులు కేటాయించలేదు. ఎన్నికల్లోనూ ఆమెకు బాధ్యతలు పెద్దగా ఇవ్వలేదు. ఏ సీటును కూడా ఆమెకు కేటాయించలేదు. తాజాగా, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆమెకు చోటివ్వలేదు. దీంతో విజయశాంతి పార్టీ మారడం కన్ఫామ్ అనే చర్చ జరుగుతున్నది.

click me!