రాహుల్ సభలో అవమానం: కోపంతో ఊగిపోయిన రాములమ్మ

By pratap reddyFirst Published Oct 22, 2018, 10:26 AM IST
Highlights

శనివారం జరిగిన భైంసాలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో విజయశాంతికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన ఆమె సభాస్థలి నుంచి వెళ్లిపోయారు. 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు ప్రచార సారథి, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి భైంసాలో జరిగిన రాహుల్ గాంధీ సభలో అవమానం జరిగింది. దాంతో రాములమ్మ ఆగ్రహంతో ఊగిపోయారు. శనివారం జరిగిన భైంసాలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో విజయశాంతికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన ఆమె సభాస్థలి నుంచి వెళ్లిపోయారు. 

తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె పార్టీ రాష్ట్ర నాయకులను, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. అయితే వారి నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. 

స్టార్ కాంపైనర్ అయిన విజయశాంతిని భైంసా సభకు ఆహ్వానించారు. రాహుల్ గాంధీ రావడానికి ముందు ప్రజల వైపు చేతులెత్తి అభివాదం చేయడానికి రెండు సార్లు ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తన సీటుకు మాత్రమే పరిమితమయ్యారు. 

తన పట్ల కాంగ్రెసు నాయకులు వ్యవహరించిన తీరును, మహిళగా తనకు జరిగిన అవమానాన్ని ఆమె పార్టీ నాయకత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏఐసిసి పరిశీలకుల్లో ఒకరు ఆమెకు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. 

అయితే, రాహుల్ గాంధీ రావడానికి ముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి విజయశాంతి నిరాకరించినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను మాట్లాడుతానని ఆమె పట్టుబట్టారని, అయితే ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. 

సభ కార్యక్రమాలను నాయకులు సరిగా రూపొందించలేదనే మాట వినిపిస్తోంది. నాయకులు కుర్చీల వద్ద లేచి నిలబడి ప్రజల వైపు చేతులూపుతూ అభివాదం చేస్తున్న సమయంలో కొంత మంది నాయకులు వేదికపైకి రావడం కనిపించింది. ప్రొటోకాల్ ను కూడా పాటించలేదని అంటున్నారు. 

రాహుల్ గాంధీ ప్రసంగం ముగిసిన తర్వాత కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అది ప్రోటోకాల్ కు విరుద్ధమని అంటున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ తన గడియారాన్ని చూపుతూ కుంతియాతో మాట్లాడారు. సమయం దాటిపోతున్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దాంతో రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని చాలా త్వరగా ముగించాల్సి వచ్చింది. 

click me!