
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో రియల్‌ఏస్టేట్ వ్యాపారి విజయ్ చందర్ దేశ్‌పాండేను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిందితులను పోలీసులు మెదక్ జిల్లా తూఫ్రాన్ వద్ద అరెస్ట్ చేశారు.ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల సమయంలో తన్వి అపార్ట్‌మెంట్ లోని తన నివాసంలో ఉన్న రియల్ ఏస్టేట్ వ్యాపారి దేశ్‌పాండేను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే వారిని బెదిరించి కిడ్నాప్ చేశారు. ఈ విషయమై విజయ్ చందర్ దేశ్‌పాండే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గంజాల్ టోల్‌ప్లాజా వద్ద నిందితుల వాహనాలను పోలీసులు గుర్తించారు. ఆ మార్గంలోని పోలీసులకు నిర్మల్ పోలీసులు సమాచారం ఇచ్చారు. తూఫ్రాన్ వద్ద టోల్ ప్లాజా వద్ద ఓ వాహనం, తూఫ్రాన్ వద్ద మరో వాహనాన్ని పోలీసులు పట్టుకొన్నారు.ఈ కిడ్నాప్ లో సంగారెడ్డికి చెందిన కృష్ణారావును ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. రూ. 2 కోట్ల భూవివాదమే ఈ కిడ్నాప్‌నకు కారణమైందనే ఆరోపణలున్నాయి. ఈ దిశగా కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.