తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శనివారం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని అన్నారు. విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు.
అయితే తెలంగాణలోని బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. విజయశాంతి కూడా గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పెద్దగా పాల్గొనడం లేదు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాలు తెలంగాణ పర్యటనలకు కూడా విజయశాంతి దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతికి బీజేపీకి టికెట్ కేటాయించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ క్రమంలోనే మల్లు రవి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లోకి విజయశాంతి చేరికను ధ్రువీకరించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టనంతో విజయశాంతి చర్చలు పూర్తయ్యాయనే ప్రచారం సాగుతుంది. ఆమెకు లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్టుగా తెలుస్తోంది.