ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే.. ధరణి కంటే మంచి పోర్టల్ తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

By Sumanth Kanukula  |  First Published Nov 11, 2023, 4:15 PM IST

తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీదే గెలుపని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీదే గెలుపని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా అత్యంత వెనకబడిన జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ అని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి‌లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ‌లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ  సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని విమర్శించారు. రూ. 38 వేల కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రూ. 1.5 లక్షల కోట్లకుపెంచారని అన్నారు. ఎవరైనా ఇసుక మీద బ్యారేజ్ కడతారా? అని ప్రశ్నించారు. 

మేడిగడ్డ బ్యారేజ్ ఏమైాన పేకమేడనా? అద్దాలు మేడనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వానొస్తే ఇసుక కదిలిందని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి భూములు అమ్ముకున్నారని విమర్శించారు. దుర్గం చిన్నయ్య  కబ్జా కోరని, అతడికి ఆడపిల్ల కనిపిస్తే అంతేనని విమర్శించారు. వంద కేసులు ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 

Latest Videos

ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 2004లో 9 గంటల విద్యుత్ ఇచ్చామని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోతే రైతుబంధు రాదని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు. ధరణి కంటే మంచి పోర్టల్ తీసుకు వస్తామని.. రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పారు. 

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు అమలు చేస్తామని తెలిపారు. మాట తప్పని ఉక్కు మహిళ సోనియా గాంధీ అని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు చూస్తే షాక్ కొడుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. 

click me!