సుప్రీంకోర్టును ఆశ్రయించిన వనమా వెంకటేశ్వరరావు..

By Sumanth KanukulaFirst Published Aug 7, 2023, 12:20 PM IST
Highlights

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వనమా పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే అంతకుముందు హైకోర్టు తీర్పును నిలిపివేసేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇక, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు జూలై 25న సంచలన తీర్పు వెలువరించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ  చేసిన వనమా వెంకటేశ్వరరావు.. తనతో పటు, తన పద్మావతికి చెందిన కొన్ని ఆస్తులను వెల్లడించకుండా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయనపై మైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆ ఎన్నికల్లో వనమాపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి 4,139 ఓట్ల తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 

వనమా వెంకటేశ్వరావు తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు వనమా వెంకటేశ్వరరావుకు రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసు కోసం జలగం వెంకట్రావుకు అయిన న్యాయపరమైన ఖర్చును సైతం చెల్లించాలని వనమాకు ఆదేశాలు జారీచేసింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇక, 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ  చేసిన  వనమా.. ఎన్నికల్లో విజయం తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.

click me!