గ్రూప్-2 పరీక్ష తేదీలపై క్లారిటీ.. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటన.. ఏం చెప్పారంటే..

Published : Aug 07, 2023, 09:59 AM IST
గ్రూప్-2 పరీక్ష తేదీలపై క్లారిటీ.. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటన.. ఏం చెప్పారంటే..

సారాంశం

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షను ఈ నెల 29,30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముందస్తుగానే ప్రకటన కూడా చేసింది.

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షను ఈ నెల 29,30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముందస్తుగానే ప్రకటన కూడా చేసింది. అయితే ఆగస్టు 23వ తేదీ వరకు గురుకులం పరీక్షలు, సెప్టెంబర్ 12వ తేదీ నుంచి జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉండటంతో.. గ్రూప్-2 పరీక్షలకు సిద్దం కావడానికి సమయం లేదని, పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. అయితే చాలా కాలంగా గ్రూప్-2 పరీక్షకు సిద్దమవుతున్న కొందరు అభ్యర్థులు మాత్రం.. పరీక్షలను వాయిదా వేయవద్దని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే గ్రూప్-2 పరీక్ష తేదీలకు సంబంధించి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టతనిచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొందరు సభ్యులు సైతం గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సీఎం కేసీఆర్‌ చర్చించారు. అన్నీ పరిశీలించిన తర్వాత గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించారు. 

అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్‌ దశలవారీగా చేయాలని ముందే చెప్పామని  తెలిపారు. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చామని  చెప్పారు. తాను ఇంతకుముందే చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని.. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదని పేర్కొన్నారు. గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే, గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గ్రూప్‌-2 నిర్వహించనున్న కేంద్రాలకు పరీక్ష తేదీలైన ఆగస్టు 29, 30 తేదీల్లో విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఇక, గ్రూప్‌-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu