హైదరాబాద్ లోని భారత రాాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కు వాస్తు దోషం వుందా? అందువల్లే బిఆర్ఎస్ పాార్టీ గడ్డు కాలాన్ని ఎదర్కొంటోందా? అలాగైతే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటి?...
హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు, జాతకాలు, వాస్తు వంటివాటిని భాగా విశ్వసిస్తారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన అనేక పూజలు, యాగాలు చేసారు. అయితే ఇటీవల అధికారాన్ని కోల్పోయాక రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ కేసీఆర్ కు ఏదీ కలిసిరావడం లేదు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడేందుకో లేక మరేదైనా కారణముందో తెలీదుగానీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు చేపట్టారు.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే తెలంగాణ భవన్ లో వాస్తుదోష నివారణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ కు వాయువ్యంగా వున్న గేటునుండి రాకపోకలు సాగుతున్నాయి. ఇది మంచిది కాదని భావిస్తున్న బిఆర్ఎస్ అధినేత ఈశాన్యం వైపుగల మరో గేటునుండి రాకపోకలు సాగించాలని నిర్ణయించారు. దీంతో వాయువ్య గేటును క్లోజ్ చేసి ఈశాన్యం వైపు గేటు ఓపెన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి... ఈశాన్యం వైపున్న గేటు వద్ద ర్యాంప్ నిర్మిస్తున్నారు.
undefined
ఇక తెలంగాణ భవన్ కు వీధిపోటు కూడా వుందని... దాని వల్ల ఏమయినా పార్టీ బలహీనపడుతుందా అన్న అనుమానం కూడా వుంది. దీంతో తాజాగా లక్ష్మీనరసింహ స్వామి ఫోటోతో కూడిన ప్లెక్సీని కూడా గేటువద్ద పెట్టారు. దీనివల్ల వీధిపోటు ద్వారా వచ్చే నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని బిఆర్ఎస్ నాయకత్వం నమ్ముతున్నట్లుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బిఆర్ఎస్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయి ఇబ్బందుల్లో వున్న పార్టీని కీలక నాయకులు, ఎమ్మెల్యేలు వీడుతున్నారు. ఎంపీ టికెట్ మీకే ఇస్తామంటున్నా వినడం లేదు... ఇలా రంజిత్ రెడ్డి, కడియం కావ్య వంటి వారు లోక్ సభ టికెట్ ఖరారయ్యాక పార్టీని వీడారు. ఇక కేసీఆర్ తో సన్నిహితంగా వుండే మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీనియర్ నేత కె కేశవరావు సైతం బిఆర్ఎస్ ను వీడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు, కిందిస్థాయి నేతలు సైతం బిఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇలా లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ బలహీనంగా మారడానికి తెలంగాణ భవన్ వాస్తు దోషం కారణమని భావిస్తుందో ఏమోగాని దోష నివారణ చర్యలు చేపట్టింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి బాధలో వున్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డారు. తీవ్రంగా గాయపడి తుంటి ఎముక చికిత్స చేయాల్సి వచ్చింది. ఇక ఆయన కూతురు కవిత ప్రస్తుతం డిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో వుంది. అలాగే పోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అర్థంకావడం లేదు. కుటుంబ సభ్యులపైనా వరుసగా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ఇలా రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ కేసీఆర్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.
అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని తెలంగాణ భవన్ వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. దీంతో రోడ్డువైపు వుండే గేటునుండి రాకపోకల సాగించడం ఇబ్బందిగా మారిందని... అందువల్లే లోపలివైపు వుండే మరో గేటును ఓపెన్ చేస్తున్నామని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. వాస్తు దోష నివారణకే ఇలా చేయడంలేదని చెబుతున్నారు.
గతంలోనూ తెలంగాణ భవన్ లో వాస్తు దోషాన్ని నివారించేందుకు మార్పులు చేర్పులు చేపట్టారు. 2014 లో అధికారంలోకి రాగానే తెలంగాణ భవన్ లోపల కొన్ని గోడలు, తలుపులను తొలగించి వాస్తుప్రకారం ఏర్పాటుచేసారు. మళ్లీ 2017 లో కూడా ఇలాగే వాస్తు ప్రకారం కొన్ని పనులు చేపట్టారు. టాయిలెట్లను తొలగించడం, హాల్, కొన్ని రూముల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు అలాగే వాస్తు దోషాలను సవరించే పనులు చేపట్టారు.