బాధలు చెప్పుకోవడానికి వేదికేది.. అందుకే ఇలా రోడ్డెక్కుతున్నారు : కాంగ్రెస్‌లో అసమ్మతిపై తేల్చేసిన వీహెచ్

By Siva KodatiFirst Published Aug 19, 2022, 3:43 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత వీ హనుమంతరావు. సమావేశాలు పెట్టకపోవడం వల్లే నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై నేతలను పిలిచి అధిష్టానం మాట్లాడాలన్నారు సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు. మర్రి శశిధర్ రెడ్డి తన ఆవేదన చెప్పారని.. దానిని అధిష్టానం సరిదిద్దాలని ఆయన హితవు పలికారు. సమావేశాలు పెట్టకపోవడం వల్లే నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టైమ్ ఇవ్వడం లేదని హనుమంతరావు ఆరోపించారు. 

తనను కూడా గతంలో తిట్టారని, అవమానించారని కానీ పెద్దమనసుతో క్షమించానని ఆయన గుర్తు చేశారు. సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇస్తే అక్కడ మాట్లాడొచ్చన్నారు. మీటింగ్‌లు పెట్టకపోతే బయటే మాట్లాడతారని వీహెచ్ హెచ్చరించారు. అసదుద్దీన్ కానీ, అక్బరుద్దీన్ కానీ తనను ఒక్క మాట కూడా అనలేదని.. అయితే సొంతపార్టీలోనే కొందరు తనను తిడుతున్నారని వీ హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు మేం మేం కొట్టుకుంటే బాగోదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గంలోనే మునుగోడు వుందని.. అందువల్ల ఆయన అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. 

ALso REad:Munugogde bypoll 2022: రేపు మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్రలకు కోమటిరెడ్డి దూరం

ఇకపోతే.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. రేవంత్ సీనియర్లను గోడకేసి కొడతా అని కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం మందలించలేదని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్  రెడ్డి తీరు సరికాదని కామెంట్ చేశారు. పార్టీ నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమని అన్నారు. అయితే ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న టీ కాంగ్రెస్‌లో.. మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంది.

ఇక, తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన స్టైలిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిపైనా పార్టీలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా వుంటున్నారని ఆయనపై కొందరు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. దాసోజు శ్రవణ్ కూడా వెళ్తూ వెళ్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఠాగూర్ తీరుతో చాలామంది నేతలు పార్టీని వీడిపోయే అవకాశాలు ఉన్నాయని.. వెంటనే ఆయన్ని తొలగించాలని అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 

click me!