
పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (V Hanumantha Rao) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) విషయంలో తమ పార్టీ తప్పు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద వరి దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి (Revanth Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkat reddy), ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వీహెచ్.. ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రెండు నెలలుగా వరి ధాన్యం కొనడం లేదని.. రైతులు వరి కుప్పలమీద మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టాలు తెలుసుకోవడానికి సీతక్క, కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో పర్యటిస్తుందని అన్నారు.
తెలంగాణలో రాజకీయంగా కొత్త డ్రామా జరుగుతుందని విమర్శించారు. తరుణ్ చుగ్ వ్యాఖ్యలు చూస్తే.. అసలు తెలివి ఉందా అని ప్రశ్నించారు. దుబ్బాక, హుజురాబాద్‌లో గెలుపుతో బీజేపీ ఆగట్లేదని వీహెచ్ అన్నారు. బీజేపీది గాడ్సే సంస్కృతి అని.. తమది గాంధీ సంస్కృతి అని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటమిలు ఏం కొత్త కాదని అన్నారు. బీజేపీ నేతలు ఏం సాధించారని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అమాంతం పెంచారని మండిపడ్డారు.
Also read: ఒకే వేదికపై రేవంత్, కోమటిరెడ్డి.. నవ్వుతూ మాట్లాడుకున్నారు.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్..
కేసీఆర్ ధాన్యం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే రైతులు మరణించేవారు కారని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారమని మండిపడ్డారు. కేసీఆర్ ఇందిరాపార్క్‌లో ధర్నా చేసిన రోజు తనకు సంతోషం అనిపించిందన్నారు. రాచకొండ అడవుల్లో ధర్నా చౌక్ ఉండాలన్న కేసీఆర్ ఇందిరాపార్కులో ఎందుకు ధర్నా చేశావ్? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తే కావచ్చని.. కానీ ఆయనకు వ్యవసాయం గురించి ఏం తెలుసని అడిగారు. తరుణ్ చుగ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు రోజులు ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఏం సాధించారని అని వీహెచ్ నిలదీశారు.
‘ఓ పెళ్లిలో ఈటలను అడిగితే.. మొదలు మా దగ్గరికే వచ్చానని అన్నాడు. కానీ ఏం జరిగిందో రేవంత్‌కే తెలియాలి.ఈటల రాజేందర్ (etela rajender).. టీఆర్‌ఎస్ బయటకు పంపిస్తే సింపతి మీద గెలిపించారు. కానీ ఈటల గెలిస్తే బీజేపీ తమ వల్లే గెలిచాడని సంబరాలు చేసుకుంటుంది’ అని విమర్శించారు. తాను కూడా పలు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించానని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగించాలని కోరారు. ఈటల రాజేందర్ తమ దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకోవాల్సింది.. కానీ ఆయన విషయంలో మేం తప్పు చేశామని చెప్పారు