కేటీఆర్.. మీ నాన్నను ఎందుకు దించేయాలో తెలుసా: ఉత్తమ్

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 10:46 AM IST
Highlights

టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు

టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.

అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. నాడు నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపినా... నేడు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్కసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సనవాన్ని అధికారికంగా జరపలేదని ఉత్తమ్ మండిపడ్డారు. భూస్థాపితమై పోతామని తెలిసినా.. 25 ఎంపీ సీట్లు కోల్పోతామని తెలిసినా తెలంగాణ ప్రజల న్యాయమైన కోరికను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు.

తెలంగాణ వచ్చాకా ప్రజలకు స్వేచ్ఛ తగ్గిందని.. నలుగురు వ్యక్తులున్న కుటుంబం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అణచివేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిని ఎందుకు దించేయాలని కేటీఆర్ అడుగుతున్నారని అందుకు తన వద్ద సమాధానం వుందన్నారు ఉత్తమ్..

తెలంగాణ కోసం నిజంగా కష్టపడ్డ మేధావులను జైలుకి పంపినందుకు, ఉద్యమకారులను వారి కుటుంబాలను మోసం చేసినందుకు, ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కేసీఆర్‌ను దించేయాలని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధంగా ఉత్తమ్ అభివర్ణించారు. కేసీఆర్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని ఈ విషయం ప్రజలంతా గుర్తుంచుకోవాలని కోరారు.

click me!