వీడి దుంపతెగ.. భార్యతో గొడవపడి పోలీసులపై కసి తీర్చుకున్నాడు.. బాంబు ఉందంటూ కాల్ చేసి.. పరుగులు పెట్టించి..

By SumaBala BukkaFirst Published Nov 17, 2022, 8:35 AM IST
Highlights

వేధింపుల కారణంగా తనను విడిచిపెట్టిన భార్యపై మనస్థాపానికి గురైన ఓ భర్త మంగళవారం రాత్రి మద్యం మత్తులో మందిర్-మసీదు జంక్షన్ దగ్గర బాంబు ఉందని పోలీసులకు తప్పుడు సమాచారం అందించాడు.

హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య విభేదాలతో ఓ వ్యక్తి పోలీసులపై కసి తీర్చుకున్నాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.. భర్త తీరుతో విసిగిపోయిన భార్య.. ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి కాపురానికి రప్పించేందుకు సొంతంగా ప్రయత్నాలు చేశాడు ఆ భర్త. పోలీసులను కూడా ఆశ్రయించాడు. అయినా ఫలితం కనిపించకపోవడంతో పోలీసులపై ఆగ్రహంతో బాంబు ఉందన్న బూటకపు కాల్ తో అర్ధరాత్రి పరుగులు పెట్టించాడు.

పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 18 రోజుల జైలు శిక్ష విధించాడు. సైదాబాద్ ఠాణా పరిధిలో మంగళ, బుధవారాల్లో జరిగిన ఈ సంఘటన పోలీసుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట రియాసత్ నగర్ డివిజన్ రాజనర్సింహ నగర్ కు చెందిన మహ్మద్ అక్బర్ ఖాన్ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య వాగ్వివాదాలు జరుగుతుండేవి. వీటితో విసిగిపోయి పిల్లలను తీసుకుని భార్య ఇటీవలే  చౌటుప్పల్లో ఉంటున్న తల్లిగారి ఇంటికి వెళ్లి పోయింది.  కాపురానికి పంపాలని పలుమార్లు కోరినా ఫలితం లేక పోవడంతో.. ఆ భర్త విషయాన్ని చౌటుప్పల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.  

ఢిల్లీ లిక్కర్ స్కాం: బేగంపేట ఎయిర్‌పోర్ట్ ద్వారా నగదు బదిలీ.. తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్య పేరు

అయినా ఫలితం లేకపోవడంతో పోలీసుల మీద తీవ్ర కోపానికి వచ్చాడు. వారిని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. అందుకే, మంగళవారం రాత్రి ఐఎస్ సదన్ కూడలిలో మందిరం మసీదు వద్ద బాంబు ఉందని డయల్ 100 కు సమాచారం ఇచ్చాడు. కంగారు పడిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు వచ్చి అర్ధరాత్రి గాలించినా ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు. దీంతో ఫేక్ కాల్ అని అనుమానం వచ్చిన పోలీసులు కాల్ ట్రాక్ ద్వారా ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాంపల్లి ఏడో స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి లక్ష్మణరావు తీర్పు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మందిర్-మసీదు జంక్షన్ సమీపంలో బాంబు పెట్టినట్లు ఓ అపరిచిత వ్యక్తి రాత్రి 9.10 గంటలకు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వార్తతో రెండు గంటల పాటు స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఎంత వెతికినా స్క్వాడ్‌లు ఏమీ కనుగొనలేకపోవడంతో పోలీసులు అది ఫేక్ కాల్ కావచ్చని అనుమానించారు. హఫీజ్ బాబానగర్‌కు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. అతని మీద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 182, 186 కింద అభియోగాలు మోపారు.

click me!