
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతిశక్తి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో కొన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయని, కొన్నిపనులు నడుస్తున్నాయని, కొన్ని పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. 2024 చివరి నాటికి మొత్తం రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో తెలంగాణలో రోడ్ల నాణ్యతను మెరుగుపరుస్తామని చెప్పారు.
ఈరోజు వరంగల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. హైవే నెట్‌వర్క్‌తో వ్యాపారం, పరిశ్రమలు ఊపందుకుంటాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
Also Read: తెలంగాణ ప్రజల బలం భారతదేశ బలాన్ని పెంచుతుందన్న మోదీ.. రూ. 6,100 కోట్ల పనులకు శంకుస్థాపన..
‘‘అమెరికా సంపన్నంగా ఉన్నందున అమెరికన్ రోడ్లు బాగా లేవు.. కానీ అమెరికా సంపన్నమైనది మాత్రం అమెరికన్ రోడ్లు బాగుడటం వల్లే అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ చెప్పిన మాటను నేను తరచుగా పునరుద్ఘాటిస్తున్నాను. ప్రధానమంత్రి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి చేయబడే రహదారి మౌలిక సదుపాయాలు మైనింగ్ పరిశ్రమ, వాణిజ్యం, వ్యాపారం, ఎగుమతులు-దిగుమతులు, చిన్న అభివృద్ధి కేంద్రాలను కలుపుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఉపాధిని కూడా కల్పిస్తున్నాం’’ అని గడ్కరీ పేర్కొన్నారు.