టీఆర్ఎస్ కుట్ర.. లేదంటే జీహెచ్ఎంసీ పీఠం బీజేపీదే: కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 17, 2021, 9:04 PM IST
Highlights

ఎంఐఎంతో పొత్తు లేకపోయుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ఎంఐఎంతో పొత్తు లేకపోయుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్- ఎంఐఎం చీకటి ఒప్పందం కారణంగానే టీఆర్ఎస్ 50కి పైగా స్థానాల్లో గెలవగలిగిందన్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో దుబ్బాక తరహా పోటీ నెలకొందని.. 17 స్థానాల్లో పోటీ చేస్తే టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగిందని ఆయన  గుర్తుచేశారు.

అయితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీగా ఆనాడు గ్రహించలేకపోయామని కేంద్ర మంత్రి అంగీకరించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం కారణంగానే  జీహెచ్ఎంసీ పీఠాన్ని బీజేపీ దక్కించుకోలేకపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

మరో 15 రోజుల తర్వాత న్యాయబద్ధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించి ఉంటే మేయర్‌ పీఠం తామే కైవసం చేసుకునేవారమని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌ను ఎవరూ రక్షించలేరని కిషన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రానున్న రెండేళ్లు బీజేపీ ఎంతో కీలకమైందని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఆ మార్పు బీజేపీతో మొదలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పూర్తిస్థాయిలో రాజకీయ పోరాటాలు, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం వచ్చిందని కిషన్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీని అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎష్ తన ప్రయత్నం చేస్తుందని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి తెలిపారు. 

click me!