
హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.అయితే అదే సమయంలో మటన్,ఫిష్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందని కేంద్రం ప్రకటించింది. బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోలు చేయడానికి జనం భయపడుతున్నారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. చికెన్ కిలో ధర రూ. 120 నుండి రూ. 160కి పడిపోయింది.సాధారణంగా మటన్ ధర రూ. 600 నుండి రూ. 800లకు పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మటన్ ధర కిలో రూ. 700కి పెరగకూడదని తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆదేశించింది.
బర్డ్ ఫ్లూ ను దృష్టిలో ఉంచుకొని మటన్, ఫిష్ ధరల విషయంలో సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.చికెన్ కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకొన్న వారు మటన్, ఫిష్ వైపునకు మళ్లుతున్నారు. దీంతో చేపల ధరలు కూడ భారీగా పెరిగాయి.
రవ్వ, బొచ్చలు కిలో రూ. 120 నుండి రూ. 150కి విక్రయిస్తారు. ప్రస్తుతం కిలో రూ. 180 నుండి 220 రూపాయాలకు విక్రయిస్తున్నారు.మటన్, చేపల ధరలను ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు సోమవారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.