కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.. అందుకే తప్పుడు వ్యాఖ్యలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Sep 25, 2022, 1:47 PM IST
Highlights

కేంద్రం నిధుల వల్లే గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని అన్నారు.

కేంద్రం నిధుల వల్లే గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని అన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్న చిన్న చెల్లింపులు కూడా సకాలంలో జరపడం లేదన్నారు. గ్రామ పంచాయితీల నిధులపై చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. కేంద్రం నిధుల వల్లే గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో మహిళా సర్పంచ్‌లు నరకం అనుభవిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలను కలిసే సమయం ఉండదని అన్నారు. రెండు సార్లు టీఆర్ఎస్‌ను ప్రజలు గెలిపిస్తే.. అన్ని విషయాల్లో మోసం చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరును చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అప్పు చేయకుంటే జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. భూములు అమ్ముకోకపోతే పూటగడవని పరిస్థితి ఉందని విమర్శించారు. లోపాలు చెబితే పక్షపాతం అంటారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ అంటే కేసీఆర్‌కు గౌరవం లేదని విమర్శించారు.

ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ లో మార్పుల కారణంగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందని రైతులు దరఖాస్తు చేసుకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని విమర్శించారు. 

గురుకులాల్లో,  హాస్టళ్లలో కనీస వసతులు లేవని ఆరోపించారు. చదువుకోవాల్సిన అమ్మాయిలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ జరగలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే దళిత బంధు పథకం.. దళితులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 

click me!