భద్రాద్రి కొత్తగూడెంలో పోడు వివాదం: అటవీ శాఖాధికారులను అడ్డుకున్న గాండ్లగూడెం వాసులు

By narsimha lodeFirst Published Sep 25, 2022, 11:23 AM IST
Highlights


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదంతో  ఫారెస్ట్ అధికారులను గాండ్లగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. పురుగల మందు డబ్బాలు చేతబూని ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్తులు నిరసనకు దిగారు.
 


ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం  ఆదివారం  నాడు ఉద్రిక్తతలకు దారి తీసింది.  ఆశ్వరావుపేట మండలం గాండ్లగూడెంలో ఫారెస్ట్ అధికారులను తమ గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడుకొని నిరసనకు దిగారు . ఫారెస్ట్ అధికారులు గ్రామంలోకి వస్తే ఆత్మహత్య చేసుకొంటామని పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళన చేపట్టారు.

ఇదే ప్రాంతంలోని బండారుగుంపు గ్రామంలో పోడు రైతులకు, అటవీ శాఖాధికారులు మధ్య శనివారం నాడు  ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఓ మహిళ స్పహ తప్పింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోడుభూముల్లో వ్యవసాయం చేయకుండా ఉండేందుకు గాను తమ వ్యవసాయ పనిముట్లను ఫారెస్ట్ అధికారులు తీసుకున్నారని పోడు రైతులు ఆరోపిస్తున్నారు. 

చాలా ఏళ్లుగా రాష్ట్రంలో పోడు భూముల వివాదం సాగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు తాము సాగు చేసుకుందున్న  భూములపై హక్కులు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ భూములు ఫారెస్ట్ భూములని అటవీశాఖాధికారులు ఈ భూముల్లో గిరిజనులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్న పరిస్థితులున్నాయి. ఏళ్ల తరబడి తతాము సాగు చేసుకుంటున్న భూములకు రాకుండా అడ్డుకోవడంపై గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు. పోడు సాగు పేరుతో అడవులకు నష్టం చేస్తున్నారని గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విమర్శలు చేస్తున్నారు.ఈ విషయమై  పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకుగాను అన్ని పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీ  వేదికగా కూడా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వెలుపల కూడ ఈ సమస్య పరిష్కరించేందుకు గాను అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని కేసీఆర్ ప్రకటించారు. 

also read:పోడు భూముల వివాదం.. జీవో నెం. 140పై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

పోడు భూముల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే 140 జీవోను విడుదల చేసింది. ఈ కమిటీలో  జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఈ కమిటీలో రాజకీయ పార్టీల నేతలకు అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ భద్రాచలానికి చెందిన శంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి  సమావేశాలు నిర్వహించవద్దని తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  ఈ విషయమై కౌంటర్ కూడా దాఖలు చేయాలని కోరింది. పోడు భూముల వివాదం పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటేనే ఏజెన్సీ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వివాదాలు సద్దుమణుగుతాయి. 
 

click me!